సహజ వాయువ ధర రెట్టింపు

India more than doubles price of locally produced gas - Sakshi

సీఎన్‌జీ రేట్లకు రెక్కలు

న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను రెట్టింపు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 1 నుంచి ఆరు నెలల పాటు కొత్త రేట్లు అమల్లో ఉంటాయి. వీటి ప్రకారం .. ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాకు కేటాయించిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌ రేటు రికార్డు స్థాయిలో యూనిట్‌కు (మిలియన్‌ బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌) 6.10 డాలర్ల స్థాయికి పెరిగింది.

ఇప్పటిదాకా ఇది 2.90 డాలర్లుగా ఉండేది. ఇక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి సంస్థలు సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌ ధర (యూనిట్‌కు) 6.13 డాలర్ల నుంచి 9.92 డాలర్లకు చేరింది. అంతర్జాతీయంగా ఇంధన రేట్లు ఎగిసిన నేపథ్యంలో ఈ మేరకు ధరలను సవరిస్తూ కేంద్ర చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలిసిస్‌ సెల్‌ (పీపీఏసీ) ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏటా ఆరు నెలలకోసారి కేంద్రం ఈ ధరలను సవరిస్తుంది.  

పెరగనున్న ద్రవ్యోల్బణం..
తాజా పరిణామంతో సీఎన్‌జీ, పైప్డ్‌ గ్యాస్‌ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే గత పది రోజుల్లో పెట్రోల్, డీజిల్‌ రేట్లు తొమ్మిది సార్లు పెంచడంతో ఇంధనాల ధర లీటరుకు రూ. 6.4  స్థాయిలో పెరిగింది. వంట గ్యాస్‌ ధర కూడా సిలిండర్‌కు రూ. 50 చొప్పున పెరిగింది. ఇక గ్యాస్‌ ధర కూడా పెరగడంతో ద్రవ్యోల్బణం మరింత ఎగిసే అవకాశం ఉందన్న ఆందోళనలు నెలకొన్నాయి.

సహజ వాయువును విద్యుత్, ఎరువుల ఉత్పత్తితో పాటు కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ), గృహాలకు పైపుల ద్వారా సరఫరా చేసే పైప్డ్‌ గ్యాస్‌ అవసరాల కోసం కూడా వినియోగిస్తున్నారు. అయితే, గ్యాస్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నందువల్ల విద్యుదుత్పత్తి వ్యయాలపై అంతగా ప్రభావం పడదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అలాగే ఎరువులకు సంబంధించి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నందున ఆ మేరకు ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉండబోదని పేర్కొన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top