
భారతదేశ రవాణా, ఇంధన విభాగంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కొన్ని అంశాలు పంచుకున్నారు. దేశంలోని ఎలక్ట్రిక్, హైడ్రోజన్, ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహన విభాగాలు ప్రపంచంలోనే నంబర్ వన్ అవుతాయని తెలిపారు. గ్రీన్ మొబిలిటీ, ఎనర్జీ డైవర్సిఫికేషన్, పారిశ్రామిక స్వావలంబన దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు.
ఇంధన విధానంలో సమూల మార్పులు
అధిక ఇథనాల్ ఇంధన మిశ్రమాలు, ముఖ్యంగా ఈ100 (100% ఇథనాల్)పై వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తగ్గించే ప్రతిపాదనను గడ్కరీ పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇథనాల్ ఆధారిత వాహనాల దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, వ్యవసాయం, పరిశ్రమలు, ఎనర్జీ అంతటా బలమైన ఇథనాల్ ఆర్థిక వ్యవస్థను ప్రేరేపించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ‘పూర్తిగా ఇథనాల్‌తో నడిచే వాహనాలు ఆచరణీయం మాత్రమే కాదు.. అవి దేశ భవిష్యత్తుకు చాలా అవసరం’ అని గడ్కరీ నొక్కి చెప్పారు. ఖరీదైన శిలాజ ఇంధన దిగుమతులకు ప్రత్యామ్నాయంగా ఈమేరకు పైలట్ ప్రాజెక్టుల అవసరాన్ని, ఇథనాల్ సామర్థ్యాన్ని హైలైట్ చేశారు.
ఇదీ చదవండి: ఆర్థిక సంక్షేమానికి ‘కస్టమైజ్డ్’ ఆరోగ్య బీమా
ముడిచమురు దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఆ వినియోగంలో రవాణా ప్రధాన వాటాను కలిగి ఉన్నందున, ఇంధన భద్రతను మెరుగుపరచడానికి ప్రత్యామ్నాయ ఇంధనాలు కీలకం. ఈ100-అనుకూలమైన వాహనాలను ప్రోత్సహించడం ద్వారా చెరకు, బియ్యం, మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ వాడకాన్ని పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా ఒనగూరే లక్ష్యాలు కింది విధంగా ఉన్నాయి.
శిలాజ ఇంధన దిగుమతులను తగ్గించండం
తక్కువ కర్బన ఉద్గారాలు
గ్రామీణ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలకు ఊతమివ్వడం
గ్రీన్ ఫ్యూయల్ టెక్నాలజీల్లో పారిశ్రామిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం
జాతీయ బయో-ఎనర్జీ ప్రోగ్రామ్‌కు మద్దతు ఇవ్వడం