భారత ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణ సెగ తగలనుందా? రాబోయే కాలంలో సామాన్యుడిపై వడ్డీ భారాలు మరింత పెరగనున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా ఆర్థిక విశ్లేషణలు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ఇంధన ధరలు, అస్థిరంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల (ఎల్ నినో) నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన కఠిన ద్రవ్య పరపతి విధానాన్ని కొనసాగించే అవకాశం ఉందని ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ వెల్లడించింది. 2027 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ రెండు దఫాలుగా వడ్డీ రేట్లను పెంచవచ్చని ఈ నివేదిక స్పష్టం చేసింది.
ద్రవ్యోల్బణం గుప్పిట్లో వృద్ధి రేటు
ద్రవ్యోల్బణ భయాలు గడిచిన కొద్దికాలంగా మార్కెట్లను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఇంధన ధరలు, వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే అంతరాయాలు ఆర్థిక వృద్ధిని మందగింపజేస్తాయని నివేదిక పేర్కొంది. ‘2027 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 5.6 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్ నినో వాతావరణ పరిస్థితుల వల్ల ఆహార ద్రవ్యోల్బణానికి అదనంగా 0.5% (50 బేసిస్ పాయింట్లు) తోడయ్యే ప్రమాదం ఉంది’ అని తెలిపింది.
‘శక్తి వనరులు, ఎల్ నినో షాక్‌ల కలయిక వల్ల 2027 ఆర్థిక సంవత్సరం సవాలుగా మారనుంది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆర్‌బీఐ 2026-27 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్లను పెంచి రెపో రేటును 5.75 శాతానికి(ప్రస్తుతం 5.25గా ఉంది) చేర్చే అవకాశం ఉంది’ అని హెచ్‌ఎస్‌బీసీ నివేదిక పేర్కొంది.
ఆహార భద్రత - వాతావరణ సవాళ్లు
గత పదేళ్ల సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే రాబోయే కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగితే అది నేరుగా పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది. 2026 తర్వాత ఎల్ నినో పరిస్థితులు బలపడితే ఆ ప్రభావం 2027లో ఆహార ధరల పెరుగుదలకు దారితీస్తుంది. అయితే, ప్రస్తుతం భారత ప్రభుత్వ గిడ్డంగుల్లో ఉన్న అధిక ఆహార ధాన్యాల నిల్వలు కొంతవరకు ఉపశమనాన్ని కలిగించవచ్చని నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది.
విధాన రూపకర్తలకు పరీక్ష
ఆర్‌బీఐ ఒకవైపు పెరుగుతున్న ధరలను అదుపు చేయాలి. మరోవైపు మందగిస్తున్న వృద్ధిని పరుగులు పెట్టించాలి. గ్రామీణ గృహాలు, చిన్న వ్యాపారాలపై ఈ ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా ఉండనుంది.
వృద్ధి మందగిస్తున్న సమయంలో వడ్డీ రేట్లు పెంచడం వల్ల పెట్టుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. అయినప్పటికీ, ద్రవ్యోల్బణం నియంత్రణకే ఆర్‌బీఐ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి!


