సవాళ్లున్నా.. భారత్‌ భేష్‌ | India 2026-27 growth outlook to 6. 6percent on West Asia conflict impact | Sakshi
Sakshi News home page

సవాళ్లున్నా.. భారత్‌ భేష్‌

Apr 10 2026 4:58 AM | Updated on Apr 10 2026 4:58 AM

India 2026-27 growth outlook to 6. 6percent on West Asia conflict impact

వరల్డ్‌ బ్యాంక్‌ నివేదికలో వెల్లడి 

2026–27 వృద్ధి అంచనాలు 6.6 శాతానికి అప్‌ 

ఫారెక్స్‌ నిల్వలు, కనిష్ట స్థాయి ద్రవ్యోల్బణం దన్ను

న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలను తట్టుకునేలా భారత్‌ పటిష్టమైన స్థితిలోనే ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. భారీ స్థాయిలో విదేశీ మారక నిల్వలు, తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం, మరింతగా వ్యయం చేయగలిగే సామర్థ్యాల వల్ల గ్లోబల్‌ ఇంధన షాక్‌లను ఎదుర్కొనగలదని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) వృద్ధి అంచనాలను 6.6 శాతానికి పెంచినట్లు పేర్కొంది. 

గత ఆర్థిక సంవత్సరం వాణిజ్య సంక్షోభాలను సమర్ధవంతంగా ఎదుర్కొన్న భారత్, ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభంలోకి పటిష్టమైన స్థితిలోనే అడుగుపెట్టిందని వరల్డ్‌ బ్యాంక్‌ రీజనల్‌ ప్రాక్టీస్‌ డైరెక్టర్‌ (దక్షిణాసియా) సెబాస్టియన్‌ ఎకార్ట్‌ తెలిపారు. యూరోపియన్‌ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్యం కుదుర్చుకోవడంతో పాటు సానుకూల పాలసీలు మొదలైన అంశాలు భారత్‌ అధిక వృద్ధి సాధించేందుకు తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు.

 ‘అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ, మిగతా వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే భారత్‌తో పాటు ప్రాంతీయంగా మిగతా దేశాలు పటిష్టమైన వృద్ధి సాధించగలవని భావిస్తున్నాం‘ అని వివరించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతంగా ఉన్న భారత్‌ వృద్ధి 2026 ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతానికి చేరింది. దేశీయంగా డిమాండ్‌ పటిష్టంగా ఉండటం, ఎగుమతులు మెరుగ్గా నమోదు కావడం ఇందుకు తోడ్పడ్డాయి. ఈ ఆర్థిక సంవత్సరపు అంచనాలు అంతకన్నా తక్కువగా 6.6 శాతంగానే ఉన్నప్పటికీ, జనవరిలో వరల్డ్‌ బ్యాంక్‌ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్న 6.5 శాతం కన్నా కొంత ఎక్కువే కావడం గమనార్హం. 

వేగవంతమైన వృద్ధి..: ఎగుమతులపై అత్యధిక టారిఫ్‌లను ఎదుర్కొన్నప్పటికీ గతేడాది భారత్‌ అత్యంత వేగవంతంగా వృద్ధి చెందిన ఎకానమీగా నిల్చిందని ఇండియాకి సంబంధించి వరల్డ్‌ బ్యాంక్‌ లీడ్‌ ఎకానమిస్ట్‌ ఆరిలియెన్‌ క్రూస్‌ తెలిపారు. ఆదాయ పన్ను కోతలు, జీఎస్‌టీ రేట్ల తగ్గింపులాంటివి దేశీ వినియోగం పెంచడానికి దోహదపడ్డాయన్నారు. ఇంధన సంక్షోభాన్ని భారత్‌ సమర్ధవంతంగా ఎదుర్కొందని, అయితే రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో రిస్క్ లు తలెత్తే అవకాశం ఉన్నందున వృద్ధిపై ప్రభావం పడొచ్చని క్రూస్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement