
ధరల పెంపుతో మరో 5.6% వృద్ధి
మార్చి త్రైమాసికంలో నమోదు
నీల్సన్‌ఐక్యూ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమలో వృద్ధి కాస్తంత నిదానించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో అమ్మకాలు (పరిమాణం పరంగా) 5.1 శాతం పెరిగాయి. కానీ, క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాలు 6.1 శాతం వృద్ధి చెందడం గమనార్హం. వినియోగదారులు తక్కువ ధరల ప్యాక్‌లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపిస్తున్నట్టు నీల్సన్‌ఐక్యూ నివేదిక వెల్లడించింది.
అమ్మకాల్లో వృద్ధి తగ్గడం ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమలోని దాదాపు అన్ని విభాగాల్లోనూ నమోదైంది. ఆహారోత్పత్తులతో పోలి్చతే ఆహారేతర ఉత్పత్తుల విభాగం కాస్త మెరుగైన ప్రదర్శన చూపించింది. చిన్న ప్యాక్‌లు ఎక్కువగా అమ్ముడుపోయే గ్రామీణ మార్కెట్ మార్చి త్రైమాసికంలో పట్టణ మార్కెట్ కంటే నాలుగు రెట్లు వేగవంతమైన వృద్ధిని నమోదు చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపించింది.
అయినప్పటికీ మొత్తం మీద గ్రామీణ మార్కెట్‌లోనూ వృద్ధి క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు తగ్గింది. ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లో చిన్న కంపెనీలు (అన్ బ్రాండెడ్) తమ వాటాను పెంచుకున్నాయి. అమ్మకాల్లో డబుల్ డిజిట్ వృద్ధి నమోదైంది. ఇక ధరల పెరుగుదల రూపంలోనూ 5.6 శాతం వృద్ధి నమోదైంది. దీంతో కలిపి చూస్తే మార్చి త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమలో వృద్ధి 11 శాతంగా ఉంది.
సంప్రదాయ దుకాణాల్లో అధిక అమ్మకాలు
సంప్రదాయ కిరాణా దుకాణాల్లోనూ ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు మార్చి త్రైమాసికంలో వృద్ధిని చూశాయి. మెట్రో మార్కెట్‌లో క్విక్‌కామర్స్ రూపంలో అధిక అమ్మకాలు కనిపించాయి. ‘‘ఆహార వినియోగంలో వృద్ధి 2025 క్యూ1లో (జనవరి–మార్చి) 4.9 శాతానికి తగ్గింది. 2024 చివరి మూడు నెలల్లో ఇది 6 శాతంగా ఉంది. వంట నూనెల విభాగంలో ధరలు పెరగడంతో వినియోగం తగ్గింది’’అని నీల్సన్‌ఐక్యూ నివేదిక వెల్లడించింది.
ఆహారోత్పత్తుల విభాగంలో ధరల పెరుగుదల 7.2 శాతంగా ఉండడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 0.9 శాతంగానే ఉంది. అంటే ధరల పెంపు ద్వారా కంపెనీలు ఆదాయాన్ని పెంచుకున్నట్టు తెలుస్తోంది. హోమ్ అండ్ పర్సనల్ కేర్ (హెచ్‌పీసీ) ఉత్పత్తుల అమ్మకాలు 5.7 శాతం పెరిగాయి. 2024 డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి 10.8 శాతం కంటే తక్కువే. ఓటీసీ అమ్మకాలు విలువ పరంగా 14 శాతం పెరిగాయి. ఈ విభాగంలో ధరలను 10.4 శాతం పెంచడం ఇందుకు అనుకూలించింది. టాప్–8 మెట్రో నగరాల్లో ఈ–కామర్స్ అమ్మకాలు 13 శాతం పెరిగాయి.
ఏడాదికి రూ.100 కోట్ల టర్నోవర్ ఉండే చిన్న ఎఫ్‌ఎంసీజీ కంపెనీల అమ్మకాలు (పరిమాణం పరంగా) 11.9 శాతం వృద్ధి చెందాయి. రూ.100–1,000 కోట్ల టర్నోవర్ ఉండే కంపెనీల అమ్మకాలు పరిమాణం పరంగా 6.4 శాతం పెరిగాయి. రూ.5,000 కోట్ల వరకు ఆదాయం కలిగిన బడా ఎఫ్‌ఎంసీజీ కంపెనీల అమ్మకాలు పరిమాణం పరంగా కేవలం 1.6 శాతం వృద్ధినే చూశాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వృద్ధి 8.1 శాతంతో పోలి్చతే గణనీయంగా తగ్గింది. ప్రధానంగా పెద్ద సంస్థలు అమ్మకాల విషయంలో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నట్టు ఈ నివేదిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.