
హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ రూ.300 కోట్ల తాజా పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించింది. తద్వారా మైసూరులో ట్రాన్స్‌ఫార్మర్ ఇన్సులేషన్ మెటీరియల్ తయారీ సామర్థ్యాలను రెట్టింపు చేసుకోనున్నట్టు తెలిపింది. 2024 అక్టోబర్‌లో ప్రకటించినట్టు భారత్‌లో మొత్తం రూ.2,000 కోట్ల పెట్టుబడుల్లో ఇది భాగమని పేర్కొంది.
తాజా పెట్టబడులతో ట్రాన్స్‌ఫార్మర్ గ్రేడ్ ప్రెస్‌బోర్డుల సరఫరాను పెంచుకోనున్నట్టు తెలిపింది. భారత్‌లో పెరుగుతున్న గ్రిడ్, రెన్యువబుల్ ఎనర్జీ అవసరాలకు మద్దతుగా నిలవడం పట్ల గర్విస్తున్నామని హిటాచీ ఎనర్జీ ఇండియా ఎండీ, సీఈవో ఎన్ వేణు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు, వాటి విడిభాగాలకు సంబంధించి భారత్‌లో, అంతర్జాతీయంగానూ డిమాండ్–సరఫరా మధ్య ఎంతో అంతరం ఉన్నట్టు చెప్పారు.
ఈ డిమాండ్ అవసరాలను తీర్చేందుకు వీలుగా విస్తరణ చేపట్టినట్టు తెలిపారు. 2027 సంవత్సరం మధ్య నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని, భారత్‌తోపాటు యూఏఈ, ఒమన్, కువైట్, సౌదీ అరేబియా, టర్కీ, ఇండోనేషియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా మార్కెట్లకు సరఫరాను పెంచుకోవచ్చని చెప్పారు.