తెలుగు గడ్డపై హీరో మోటర్‌ కార్ప్‌ గిన్నీస్‌ రికార్డ్‌

Hero MotoCorp Achieves Guinness World Record - Sakshi

World's Largest Motorcycle Logo: ప్రపంచంలోనే అతి పెద్ద బైకుల తయారీ సంస్థగా పేరొందిన హీరో మోటర్‌ కార్ప్‌ మరో రికార్డు సాధించింది. ఆ కంపెనీకి చెందిన 100 మంది సిబ్బంది 90 రోజుల పాటు శ‍్రమించి హీరో పేరును గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డులోకి ఎక్కించారు. తెలుగు నేలను వేదికగా హీరో సంస్థ ఈ ఘనత సాధించింది. 

చిత్తూరులో
హోండా కంపెనీ నుంచి హీరో విడిపోయి పదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని హీరో అరుదైన కార్యక్రమం చేపట్టింది. దీనికి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాను వేదికగా చేసుకుంది.  ప్రపంచంలోనే అతి పెద్ద మోటర్‌ సైకిల్‌ లోగోను ఏర్పాటు చేసి గిన్నీస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటు సంపాదించింది. 

గిన్నీస్‌ రికార్డ్‌
చిత్తూరులో ఉన్న హీరో మోటార్‌ కార్ప్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌లో  స్ప్లెండర్‌ ప్లస్‌ బైకులను హీరో లోగో ఆకారంలో ఏర్పాటు చేసింది. ఫ్యాక్టరీ సమీపంలో నేలను చదును చేశారు. ఆ తర్వాత హీరో లోగో ఆకారంలో రోజుకు కొన్ని  బైకులను పార్క్‌ చేశారు. దీని కోసం హీరోకు చెందిన వంద మంది సిబ్బంది 90 రోజుల పాటు నిర్విరామంగా పని చేశారు. ఈ లోగో ఆకారంలో 1845 బైకులను నిలిపి ఉంచారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని షూట్‌ చేసి గిన్నీస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డుకు పంపించారు. అన్ని వివరాలు పరిశీలించిన అనంతరం లార్జెస్ట్‌ మోటార్‌ సైకిల్‌ లోగోగా గిన్నీస్‌ గుర్తించింది. 

పదికోట్ల బైకులు
హీరో కంపెనీ నుంచి పది కోట్ల బైకులు అమ్మడంతో పాటు హీరో పదేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టినట్టు హీరో మోటార్‌ కార్ప్‌ గ్లోబల్‌హెడ్‌ మాలో ఏ మాసన్‌ తెలిపారు. ఈ లోగో ఏర్పాటుకు సంబంధించిన వీడియోను ఆగస్టు 9న హీరో రిలీజ్‌ చేసింది. 
- సాక్షి, వెబ్‌డెస్క్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top