వృద్ధి బాటలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ | Health insurance sector records Strong growth | Sakshi
Sakshi News home page

వృద్ధి బాటలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌

Mar 27 2026 6:21 AM | Updated on Mar 27 2026 7:11 AM

Health insurance sector records Strong growth

రూ.1.2  లక్షల కోట్లకు ప్రీమియం 

2024–25లో 9 శాతం వృద్ధి 

న్యూఢిల్లీ: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రంగం విస్తరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ రంగంలో ప్రీమియం ఆదాయం 2024–25 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం వృద్ధితో రూ.1.2 లక్షల కోట్లు దాటింది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పట్ల పెరుగుతున్న అవగాహన, వైద్య అత్యవసరాల్లో ఆర్థిక రక్షణ ఉండాలని కోరుకోవడం వృద్ధికి దారితీస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 

సేవల్లో సామర్థ్యం పెరిగేందుకు, పాలసీదారులకు సకాలంలో సాయం అందించే లక్ష్యంతో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) నగదు రహిత క్లెయిమ్‌ల పరిష్కారానికి నిర్దేశిత గడువులను విధించినట్టు పేర్కొంది. నగదు రహిత ముందస్తు అంగీకారం గంటలోపు తెలియజేయాలని.. క్లెయిమ్‌పై తుది ఆమోదాన్ని మూడు గంటల్లో తెలియజేయాలని నిర్దేశించినట్టు వెల్లడించింది. జాప్యాన్ని సాధ్యమైనంత మేర తగ్గించేందుకు, రోగులు సకాలంలో వైద్య సేవలు పొందేందుకు ఈ నిబంధనలు సాయపడతాయని తెలిపింది. వయసు మీద పడతుండడం, అధిక రక్షణ, అదనపు సదుపాయాలతో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలు పెరుగుతున్నట్టు ఆర్థిక శాఖ పేర్కొంది.  

అందుబాటు ధరల్లో ఉండాలి...
బీమా ఉత్పత్తుల ప్రీమియంలు అన్ని రిస్క్‌లను పరిగణనలోకి తీసుకుని, సరైన ధరలపై అందుబాటులో ఉండాలంటూ 2024లో ఐఆర్‌డీఏఐ జారీ చేసిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ ప్రస్తావించింది. వీటిని నియమిత యాక్చువరీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారని తెలిపింది. 2024–25లో బీమా భరోసా పోర్టల్‌పై జనరల్, హెల్త్‌ ఇన్సూరెన్స్‌కు సంబంధించి 1,37,361 ఫిర్యాదులు దాఖలయ్యాయని, ఇందులో 93 శాతం అంటే 1,27,755 ఫిర్యాదులు పరిష్కారమైనట్టు వెల్లడించింది. బీమా క్లెయిమ్‌ తిరస్కరణ, రద్దు అన్నవి పాలసీ నియమ, నిబంధనల పరిధిలోనివిగా పేర్కొంది. బీమా రక్షణను మించడం, కో–పేమెంట్‌ క్లాజ్, ఉప పరిమితులు, టాపప్‌ పాలసీల్లో డిడక్టబుల్, రూమ్‌ రెంట్‌ పరిమితి మించడం తదితర అంశాలూ క్లెయిమ్‌ తిరస్కరణ, రద్దుకు సంబంధించి ఉన్నట్టు తెలిపింది.    

Advertisement
 
Advertisement
Advertisement