HDFC బ్యాంక్‌ ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ | hdfc bank introduces work from home wfh policy HDFC | Sakshi
Sakshi News home page

HDFC బ్యాంక్‌ ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’

May 20 2026 6:45 PM | Updated on May 20 2026 7:19 PM

hdfc bank introduces work from home wfh policy HDFC

భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ తన ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఎంపిక చేసిన విభాగాల ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్'(WFH) విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం.. అర్హులైన ఉద్యోగులు వారానికి రెండు రోజుల పాటు ఇంటి నుండి లేదా రిమోట్‌గా పని చేయడానికి బ్యాంక్ అనుమతినిచ్చింది.

ఈ కొత్త పాలసీ తక్షణమే అమలులోకి వచ్చిందని, ప్రాథమికంగా 30 రోజుల పాటు దీన్ని పరిశీలించి, ఫలితాల ఆధారంగా ఈ విధానాన్ని కొనసాగించేది.. లేనిది నిర్ణయించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారాలు వెల్లడించారు. ముడి చమురు ధరలు పెరుగుతున్న  నేపథ్యంలో.. ఇంధనాన్ని పొదుపు చేసేందుకు కార్పొరేట్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ సమావేశాలను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వీరికే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌..
బ్యాంకు మౌలిక సదుపాయాలకు సంబంధించిన రెండు ప్రధాన విభాగాలలోని ఉద్యోగులకు ఈ హైబ్రిడ్ వర్క్ మోడల్ వర్తిస్తుంది. బిజినెస్ ఎనేబుల్ ఫంక్షన్లు అంటే ట్రెజరీ ఆపరేషన్స్, క్రెడిట్ అండర్ రైటింగ్ & రిస్క్, ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ (IT) సేవలు వంటి కీలక కార్యాచరణ విభాగాల్లో పని చేసే ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం అందుబాటులో ఉంటుంది. అలాగే కార్పొరేట్ ఎనేబుల్ ఫంక్షన్లు అయిన హ్యూమన్ రీసోర్సెస్ (HR), ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, లీగల్ & కాంప్లయన్స్, అలాగే సెక్రటేరియల్, బోర్డు విధులు నిర్వహించే అధికారులు కూడా రిమోట్‌ వర్క్‌ విధానంలో పనిచేస్తారు.

అయితే కస్టమర్లతో నేరుగా లావాదేవీలు జరిపే బ్యాంక్ బ్రాంచ్‌లు (శాఖలు), ఇతర ఫ్రంట్-ఆఫీస్ కార్యకలాపాల్లో నిమగ్నమైన ఉద్యోగుల పని విధానంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఆయా విభాగాలు ఎటువంటి అంతరాయం లేకుండా యథావిధిగా కొనసాగుతాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement