
అధిక ఫీచర్ల వైపు కొనుగోలుదారుల చూపు
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ల వాటా 32 శాతం
ఏటా 3.5 లక్షల వరకు వాహనాల విక్రయం
ఎంట్రీ స్థాయి చిన్న కార్ల వాటా 10 శాతం లోపే
న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా తగ్గుతున్న చిన్న కార్ల అమ్మకాలను మళ్లీ పెంచుకునేందుకు వాహనాల కంపెనీలు కొత్త వ్యూహాలను ఎంచుకుంటున్నాయి. ప్రీమియం ఫీచర్లను పొందుపరుస్తూ కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మొదటిసారిగా కారు కొనుగోలు చేస్తున్న వారు బేసిక్ వేరియంట్ కన్నా కాస్తంత ఎక్కువ ఫీచర్లుండే వాహనాలను ఎంచుకుంటున్న నేపథ్యంలో కొత్త మోడల్స్‌ను ప్రవేశపెడుతూ మార్కెట్ వాటాను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి.
పదేళ్ల క్రితం మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో చిన్న కార్ల వాటా దాదాపు 50 శాతం వరకు ఉండేది. కానీ గత ఆర్థిక సంవత్సరంలో ఇది 22 శాతానికి పడిపోయింది. ఈ సెగ్మెంట్లో అంతర్గతంగా చూస్తే ఎంట్రీ స్థాయి హ్యాచ్‌బ్యాక్‌లపై ప్రతికూల ప్రభావం అత్యధికంగా ఉంది. నియంత్రణలపరంగా వివిధ నిబంధనలను అమలు చేయాల్సి వస్తుండటంతో వీటి ధరలు భారీగా పెరిగిపోవడమే ఇందుకు కొంత కారణంగా నిలుస్తోంది. కఠినతరమైన ఉద్గారాల నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించాల్సి రావడంతో గత కొన్నేళ్లలో చిన్న కార్ల ధరలు దాదాపు రూ. 90,000 వరకు పెరిగాయి. ఇక, కాస్తంత ఎక్కువ వెచ్చించగలిగే స్థోమత ఉన్న వాళ్లు మరింత ప్రీమియంగా అనిపించే, మరిన్ని ఫీచర్లు ఉండే కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ క్రమంలో రూ. 4.5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు ఖరీదు చేసే ఎంట్రీ స్థాయి హ్యాచ్‌బ్యాక్‌ల అమ్మకాల వాటా 10 శాతం లోపునకు క్షీణించగా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ల వాటా 32 శాతానికి పెరిగినట్లు పరిశ్రమ వర్గాల తెలిపాయి. రూ. 7.5 లక్షల నుంచి రూ. 13.5 లక్షల వరకు ఖరీదు చేసే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లు దేశీయంగా ఏటా 3,00,000–3,50,000 వరకు అమ్ముడవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో చిన్న కార్ల వాటా 20–22 శాతం నుంచి పెద్దగా పెరగకపోయినా .. ప్రీమియం మోడల్స్‌కి డిమాండ్ నెలకొనడంతో మార్కెట్ పరిధి పెరిగి, వాల్యూమ్స్ సైతం పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కొత్త ఉత్పత్తుల రాకతో ఈసారి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ల అమ్మకాలు మరికాస్త మెరుగుపడొచ్చని వివరించాయి.
వడ్డీ రేట్ల కోతలతో దన్ను ..
ఆదాయ పన్ను శ్లాబ్‌లలో మార్పులు, వడ్డీ రేట్ల తగ్గింపు తదితర పరిణామాలనేవి ప్రజలు వినియోగంపై మరికాస్త ఎక్కువ వెచ్చించేందుకు దోహదపడే అవకాశం ఉంది. అయితే, వారు దేనిపై వెచ్చిస్తారనే విషయంలో సందిగ్ధత నెలకొంది. కోవిడ్ మహమ్మారి సమయంలోనూ, ఆ తర్వాత రోజుల్లోనూ ఒక్కసారిగా వ్యక్తిగత వాహనాలకు డిమాండ్ పెరిగింది. అది ప్రస్తుతం కాస్త తగ్గింది. ఇప్పుడు కుటుంబాలతో కలిసి విహార యాత్రలకు వెళ్లడంలాంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర దిగ్గజాలు అంచనా వేస్తున్నట్లుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ మార్కెట్ వృద్ధి 1–2 శాతానికే పరిమితం కాకుండా 5 శాతం మేర నమోదయ్యే అవకాశం ఉందని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పులు చేయడమనేది పొదుపునకు కాస్త దారి తీసినా .. ప్రస్తుతం రేట్లు బాగా పెరిగిపోవడం వల్ల చిన్న కార్ల అమ్మకాలకు పెద్దగా తోడ్పడకపోవచ్చని భార్గవ చెప్పారు.
అఫోర్డబిలిటీ సమస్య..
కార్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడమనేది చిన్న కార్ల అమ్మకాలకు సవాలుగా మారుతోందంటూ మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇది మొత్తం ఆటో మార్కెట్‌పై ప్రభావం చూపుతోందని చెప్పారు. ‘రూ. 10 లక్షల కారు కొనాలంటే కుటుంబ వార్షికాదాయం రూ. 12 లక్షల పైగా ఉంటే తప్ప కొనే పరిస్థితి లేదు. దేశంలో ఆ స్థాయి ఆదాయాలు ఉండే వాళ్లు సుమారు 12 శాతం ఉండొచ్చు. మిగతా 88 శాతం మంది వార్షికాదాయం చాలా తక్కువే ఉంటోంది. ఇలాంటప్పుడు కార్ల మార్కెట్ అధిక వృద్ధి సాధించడం సవాలుగా ఉంటోంది‘ అని ఆయన పేర్కొన్నారు.
అఫోర్డబిలిటీ సమస్య కారణంగా 66 శాతం మంది వినియోగదారులకు కార్ల కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారని వివరించారు. చిన్న కార్లు పుంజుకుంటే తప్ప దేశీ పరిశ్రమ వృద్ధి ఒక మోస్తరు వృద్ధితోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుందని భార్గవ తెలిపారు. దేశీయంగా 20 కోట్లకు పైగా కుటుంబాల వార్షికాదాయం రూ. 5,00,000 లోపే ఉంటోందంటూ ఇటీవల ఓ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన అంశాలు భార్గవ అభిప్రాయానికి ఊతమిస్తున్నాయి.