
న్యూఢిల్లీ: జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలు సాధారణ ప్రజలకు చేరాలని, సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చే కొత్త పన్ను విధానం అమలు తీరును కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
జీఎస్టీ పునర్వ్యవస్థీకరణ కింద ప్రజలకు హామీ ఇచ్చిన ఉపశమనం వారికి దక్కకపోతే తయారీదారులు, పరిశ్రమ భాగస్వాములు, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె అన్నారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రయోజనాలను సామాన్యులకు అందించకపోతే రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
కొత్త జీఎస్టీ రేట్ల ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరేలా పర్యవేక్షించడానికి తయారీదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. జీఎస్టీ ప్రయోజనాలు ఏ రాష్ట్రంలోనైనా ప్రజలకు అందకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రిని ప్రశ్నిస్తామని చెప్పారు.
ఇప్పటివరకు ఉన్న నాలుగు శ్లాబుల జీఎస్టీ నిర్మాణాన్ని మార్పు చేసి కేంద్ర ప్రభుత్వం రెండే శ్లాబులతో సరళీకృత జీఎస్టీ విధానాన్ని ఈనెలల 22 నుంచి అమలు చేస్తోంది. కొన్ని రకాల వస్తువులపై జీఎస్టీని 5 శాతానికి, మరికొన్ని వస్తువులపై పన్నును 18 శాతానికి పరిమితం చేసి సామాన్యులకు ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తోంది. కొన్ని హానికరమైన, లగ్జరీ ఉత్పత్తులపై మాత్రం ప్రత్యేకంగా 40 శాతం జీఎస్టీని అమలు చేయనుంది.