Gold: తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొంటున్నారా? ఈ జిల్లాల్లో అమలులోకి కొత్త రూల్స్

Govt rolls out third phase of mandatory gold hallmarking in 55 new districts - Sakshi

బంగారు నగల హాల్‌మార్కింగ్‌కు సంబంధించిన మూడో దశను కేంద్ర ప్రభుత్వం తాజగా ప్రకటించింది. రెండేళ్ల క్రితం గోల్డ్‌ హాల్‌మార్కింగ్ (Gold Hallmarking) నిబంధనల్ని ప్రకటించిన కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా జిల్లాలవారీగా దశలవారీగా అమలు చేస్తూ వస్తోంది. ఇప్పటికి రెండు దశలను అమలు చేసిన ప్రభుత్వం తాజాగా మూడో దశలో 16 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 55 కొత్త జిల్లాల్లో హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం, బంగారు ఆభరణాల స్వచ్ఛత ధ్రువీకరణ ప్రమాణం. 2021 జూన్ 16 వరకు ఇది స్వచ్చందంగా ఉండేది. ఆ తర్వాత ప్రభుత్వం దశలవారీగా గోల్డ్ హాల్‌మార్కింగ్‌ని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోడల్‌ ఏజెన్సీగా బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (BIS) వ్యవహరిస్తోంది. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 343 జిల్లాల్లో గోల్డ్‌ హాల్‌మార్కింగ్ తప్పనిసరి. 2021 జూన్ 23న ప్రారంభించిన మొదటి దశలో 256 జిల్లాలు, 2022 ఏప్రిల్ 4 నుంచి రెండవ దశలో మరో 32 జిల్లాల్లో హాల్‌ మార్కింగ్‌ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇక మూడో దశలో సెప్టెంబర్ 8వ తేదీ నుంచి కొత్తగా మరో 55 జిల్లాల్లో హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ న నోటిఫికేషన్ జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలు ఇవే..
కేంద్రప్రభుత్వం మూడో దశలో ప్రకటించిన హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి జిల్లాల జాబితాలో తెలుగు రాష్ట్రాల్లో 9 జిల్లాలు ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో అన్నమయ్య, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్‌టీఆర్, నంద్యాల జిల్లాలు ఉండగా తెలంగాణలో మేడ్చల్ మల్కాజ్‌గిరి, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో బంగారు నగలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి.

హాల్‌మార్క్ అంటే ఏమిటి?
బంగారు నగల స్వచ్ఛతను తెలియజేసే ముద్రనే హాల్‌మార్క్ అంటారు. ఈ హాల్‌మార్కింగ్‌లో మొదట బిస్‌ లోగో, బంగారం స్వచ్ఛత, వ్యాపారి లోగో, అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్ వివరాలు ఉండేవి. కానీ 2023 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త HUID హాల్‌మార్కింగ్ వచ్చింది. ఇందులో మూడు అంశాలు ఉంటాయి. అవి BIS లోగో, ఆభరణం స్వచ్ఛత, ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID. ఒక్కో ఆభరణానికి ఒక్కో రకమైన విశిష్ట సంఖ్య ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top