ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగంలో, ముఖ్యంగా గ్రామీణ, పట్టణ మధ్యతరగతి వర్గాలకు పెద్ద ఊరటనిచ్చింది. ఆస్తి లావాదేవీల్లో పాన్ (PAN) కార్డ్ నిబంధనలను సడలిస్తూ వెలువడిన ఈ మార్పులపై సమగ్ర కథనం మీ కోసం..
ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో అడుగడుగునా ఎదురయ్యే డాక్యుమెంటేషన్ చిక్కులను తొలగిస్తూ, పాన్ కార్డ్ బహిర్గత పరిమితిని పెంచుతూ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనలు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపిరి పోయనున్నాయి.
మారిన నిబంధన
ఇప్పటి వరకు రూ. 10 లక్షలకు మించిన ఏ ఆస్తి లావాదేవీకైనా కొనుగోలుదారు, అమ్మకందారు తప్పనిసరిగా పాన్ కార్డు వివరాలను సమర్పించాల్సి ఉండేది. అయితే, ప్రస్తుత మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియల్లో జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పరిమితిని రూ. 20 లక్షలకు పెంచింది. అంటే రూ. 20 లక్షల లోపు విలువ చేసే ప్లాట్లు, ఇళ్లు లేదా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు ఇకపై పాన్ కార్డు అవసరం లేదు.
ఎవరికి లాభం?
ఈ నిర్ణయం ప్రధానంగా కింది వర్గాలకు వరంగా మారనుంది.
గ్రామీణ, సెమీ అర్బన్ కొనుగోలుదారులు: చిన్న పట్టణాల్లో డాక్యుమెంటేషన్ లోపాలు ఎక్కువగా ఉంటాయి. పాన్ కార్డు లేని వారు లేదా అప్లై చేసినా రాని వారు ఇకపై రూ. 20 లక్షల లోపు ఒప్పందాలను వేగంగా ముగించుకోవచ్చు.
మొదటిసారి ఇల్లు కొనేవారు: అధికారిక ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉండే సామాన్యులకు, సమ్మతి (Compliance) సంబంధిత ఇబ్బందులు తగ్గి, ఆస్తి యాజమాన్యం సులభతరమవుతుంది.
రియల్ ఎస్టేట్ డెవలపర్లు: చిన్న ప్లాట్ల అమ్మకాలు జరిపే డెవలపర్లకు డాక్యుమెంటేషన్ ఆలస్యం కారణంగా ఆగిపోయే డీల్స్ ఇకపై చకచకా పూర్తవుతాయి.
లావాదేవీల్లో వేగం.. తగ్గిన అడ్డంకులు
గతంలో రూ. 15 లక్షల విలువైన ప్లాట్ కొనుగోలు చేయాలంటే, రిజిస్ట్రేషన్ సమయానికి పాన్ కార్డు లేకపోతే ఆ ప్రక్రియ వారాల తరబడి నిలిచిపోయేది. తాజా సడలింపుతో అదనపు ఫార్మాలిటీలు లేకుండానే నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంటుంది. ఇది అటు కొనుగోలుదారులకు, ఇటు అమ్మకందారులకు సమయాన్ని, శ్రమను ఆదా చేస్తుంది.
పన్ను నిబంధనల్లో మార్పు లేదు!
ప్రక్రియను సులభతరం చేయడం కోసమే ఈ నిబంధనను సడలించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, మూలధన లాభాల పన్ను (Capital Gains Tax) విషయంలో ఎలాంటి మార్పులు లేవు. లావాదేవీ విలువ పెరిగినా, తగ్గినా వర్తించే పన్ను నిబంధనలు యథావిధిగా ఉంటాయి. ఇది కేవలం రిజిస్ట్రేషన్ సమయంలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను తొలగించేందుకు చేసిన సంస్కరణ మాత్రమే.
ఇదీ చదవండి: ఇల్లు ఇక్కడ కడితే తక్కువ ఖర్చు!


