పన్ను వివాదం.. కోట్లు విరాళం ఇచ్చిన సీఈఓ! | Google Co Founder Sergey Brin Donates 500000 Dollars To Fight Overpaid Tax | Sakshi
Sakshi News home page

పన్ను వివాదం.. కోట్లు విరాళం ఇచ్చిన సీఈఓ!

May 23 2026 9:11 PM | Updated on May 23 2026 9:16 PM

Google Co Founder Sergey Brin Donates 500000 Dollars To Fight Overpaid Tax

అమెరికాలో కొనసాగుతున్న పన్నుల వివాదం.. మధ్య సెర్గే బ్రిన్ తీసుకున్న నిర్ణయం టెక్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. ఓవర్‌పెయిడ్ సీఈఓ ట్యాక్స్ అని పిలుస్తున్న వివాదాస్పద పన్ను ప్రతిపాదనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న రాజకీయ కమిటీకి ఈయన 5 లక్షల డాలర్లు (సుమారు రూ.4.80 కోట్లు) విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా.. వ్యాపార సంస్థలకు అనుకూలంగా భావిస్తున్న మరో పన్ను ప్రతిపాదనకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలో రెండు ముఖ్యమైన పన్ను ప్రతిపాదనలు చర్చనీయాంశంగా మారాయి. అవి 'మెజర్ సీ, మెజర్ డి'. వీటిపై జూన్ 2న ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది.

మెజర్ Cకు వ్యాపార వర్గాలు మద్దతు ఇస్తున్నాయి. ఈ ప్రతిపాదన ప్రకారం.. చిన్న వ్యాపార సంస్థలకు పన్ను మినహాయింపు పరిమితిని 5 మిలియన్ డాలర్ల నుంచి 7.5 మిలియన్ డాలర్ల వరకు పెంచుతారు. దీని వల్ల చిన్న కంపెనీలకు ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. అయితే.. పెద్ద కంపెనీలపై పన్ను భారం కొంత పెరుగుతుంది. అయినప్పటికీ, నగర ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతూనే చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడమే దీని లక్ష్యమని మద్దతుదారులు చెబుతున్నారు.

ఇక మెజర్ D మాత్రం పెద్ద వివాదానికి దారితీసింది. దీనిని ఓవర్‌పెయిడ్ సీఈఓ ట్యాక్స్ అని పిలుస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం కంపెనీల్లో సీఈఓల జీతాలు, సాధారణ ఉద్యోగుల జీతాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల ఆధారంగా లెక్కిస్తారు. అంతేకాకుండా.. పన్ను రేట్లు పెరగడంతో పాటు భవిష్యత్తులో వాటిని తగ్గించడం కూడా కష్టమవుతుంది.

కార్మిక సంఘాలు, కొన్ని సంస్థలు మెజర్ డీ ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నాయి. ధనిక కంపెనీలు సమాజానికి తగిన పన్ను చెల్లించాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. కానీ వ్యాపార వర్గాలు మాత్రం.. ఈ విధానం వల్ల కంపెనీలు నగరాన్ని విడిచి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే శాన్ ఫ్రాన్సిస్కోలో ఆఫిసులు ఖాళీ అవడం, కంపెనీలు ఇతర ప్రాంతాలకు మారడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ పన్ను విధానం ఆర్థిక పరిస్థితిని మరింత దెబ్బతీస్తుందని కొందరు విమర్శిస్తున్నారు.

సెర్గే బ్రిన్ కూడా అధిక పన్నుల విధానాలకు వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. 1979లో తన కుటుంబం సోవియట్ యూనియన్‌లోని సామ్యవాద పాలన నుంచి అమెరికాకు వలస వచ్చిందని గుర్తుచేసుకుంటూ, 'సోషలిజం సమాజాన్ని ఎలా దెబ్బతీస్తుందో నేను స్వయంగా చూశాను. కాలిఫోర్నియా కూడా అలాంటి పరిస్థితికి వెళ్లకూడదు' అని వ్యాఖ్యానించారు.

కాగా.. బ్రిన్ ఇటీవల తన నివాసాన్ని సిలికాన్ వ్యాలీ నుంచి నెవాడాలోని లేక్ టాహో సమీప ప్రాంతానికి మార్చినట్లు సమాచారం. నెవాడాలో కాలిఫోర్నియా మాదిరిగా అధిక రాష్ట్ర పన్నులు లేకపోవడం కూడా ఈ నిర్ణయానికి కారణమని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆ టీమ్ వల్లే సమస్యలు.. అందుకే లేఆఫ్స్!

Advertisement
 
Advertisement
Advertisement