దేశంలో గత వారం రోజులుగా బంగారం, వెండి ధరల్లో గణనీయమైన హెచ్చుతగ్గులు కనిపించాయి. అయితే వారం మొత్తంలో పెరుగుదల కంటే తగ్గుదలే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మే 25 నుంచి మే 31 మధ్య పసిడి, వెండి ధరలు వరుస తగ్గుదలతో కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి.
మే 25తో పోలిస్తే మే 31 నాటికి హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,59,380 నుంచి రూ.1,57,040కు చేరి రూ.2,340 తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,46,100 నుంచి రూ.1,43,950కు తగ్గి రూ.2,150 మేర దిగివచ్చింది.
బంగారం ధరలు మారాయిలా..
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర మే 25న రూ.1,59,380 ఉండగా, మే 26న రూ.490 తగ్గి రూ.1,58,890కు చేరింది. మే 27న మరో రూ.600 తగ్గి రూ.1,58,290, మే 28న ఏకంగా రూ.2,230 పడిపోయి రూ.1,56,060కు చేరింది. అయితే మే 29న రూ.1,580 పెరిగి రూ.1,57,640కు చేరగా, మే 30న రూ.600 తగ్గి రూ.1,57,040కు పడిపోయింది. మే 31న స్థిరంగా కొనసాగింది.
ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర మే 25న రూ.1,46,100 నుంచి మే 26న రూ.450, మే 27న రూ.550, మే 28న రూ.2,050 తగ్గి రూ.1,43,050కు చేరింది. అనంతరం మే 29న రూ.1,450 పెరిగి రూ.1,44,500కు చేరగా, మే 30న రూ.550 తగ్గి రూ.1,43,950కు పడిపోయి, మే 31న అదే స్థాయిలో నిలిచింది.
వెండిలోనూ తగ్గుదల
వెండి ధరలు కూడా వారాంతానికి బలహీనతను చూపించాయి. వెండి ధరలు కేజీకి మే 25, 26 తేదీల్లో రూ.2.95 లక్షల వద్ద స్థిరంగా ఉండగా, మే 27న రూ.5,000 తగ్గి రూ.2.90 లక్షలకు చేరాయి. మే 28న మరో రూ.5,000 తగ్గి రూ.2.85 లక్షలకు పడిపోయినా, మే 29న తిరిగి రూ.5,000 పెరిగి రూ.2.90 లక్షలకు చేరాయి. మే 30, 31 తేదీల్లో అదే స్థాయిలో కొనసాగాయి. మొత్తంగా వారాంతానికి వెండి కేజీకి రూ.5,000 తగ్గిందన్న మాట.
అంతర్జాతీయ మార్కెట్లలో పారిశ్రామిక డిమాండ్ అంచనాలు, డాలర్ బలపడటం, పెట్టుబడిదారుల లాభాల స్వీకరణ ప్రభావంతో కిలో వెండి ధరల్లో తగ్గుదల నమోదైంది. దేశీయ బులియన్ మార్కెట్లలో కొనుగోళ్లు మందగించడం కూడా వెండి ధరలపై ప్రభావం చూపింది.
బంగారం ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలివే..
ఈ వారం బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయ పరిణామాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అమెరికా ఆర్థిక గణాంకాలు అంచనాల కంటే మెరుగ్గా రావడం, డాలర్ సూచీ బలపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరి కొనసాగవచ్చన్న అంచనాలు బంగారంపై ఒత్తిడిని పెంచాయి. మరోవైపు భౌగోళిక ఉద్రిక్తతలపై కొంత ఉపశమనం కనిపించడంతో సేఫ్‌హేవన్ ఆస్తిగా బంగారంపై డిమాండ్ తగ్గింది. దీంతో అంతర్జాతీయ బులియన్ ధరలు సరిదిద్దుకునే దిశగా కదిలాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లలోనూ ప్రతిబింబించింది.
ఇదీ చదవండి: బంగారం ఖరీదంటే భ్రమే!
వచ్చే వారం ఎలా ఉంటుంది?
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అమెరికా ఫెడ్ విధాన నిర్ణయాలు, డాలర్ కదలికలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు వచ్చే రోజుల్లో బంగారం, వెండి ధరలకు కీలకంగా మారనున్నాయి. ధరలు ఇటీవల గరిష్ఠ స్థాయిల నుంచి కొంత వెనక్కి వచ్చినప్పటికీ, దీర్ఘకాల పెట్టుబడిదారుల దృష్టిలో విలువైన లోహాలపై ఆసక్తి కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే వారంలో అంతర్జాతీయ సంకేతాల ఆధారంగా మరింత హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉందని బులియన్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


