ఒకే రోజున రూ. 4,100 డౌన్
మరో 5–10% కరెక్షన్‌కి అవకాశం
న్యూఢిల్లీ: అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పసిడి ధర భారీగా పడిపోయింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం రేటు ఏకంగా రూ. 4,100 క్షీణించి రూ. 1,21,800కి దిగి వచ్చింది. అంతర్జాతీయంగా కూడా కీలకమైన 4,000 డాలర్ల దిగువకి పడిపోయిన పుత్తడి ధర (ఔన్సుకి – 31.1 గ్రాములు) మరింతగా తగ్గింది.
సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పసిడికి డిమాండ్ తగ్గడంతో అమ్మకాలు వేగవంతమయ్యాయని, మూడు వారాల కనిష్ట స్థాయికి ధర నెమ్మదించిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు. మరోవైపు, వెండి ధర కూడా కేజీకి ఏకంగా రూ.6,250 మేర క్షీణించి రూ. 1,45,000 స్థాయికి పడిపోయింది.
ఇక అంతర్జాతీయంగా చూస్తే స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 94.37 డాలర్లు (2.37 శాతం) క్షీణించి 3,887.03 డాలర్లకు తగ్గింది. అంతకు ముందు సెషన్‌లోనే 132.02 డాలర్లు తగ్గి 4,000 మార్కు దిగువన క్లోజయ్యింది. ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో డిసెంబర్ కాంట్రాక్ట్ పసిడి ధర ఒక దశలో సుమారు రూ. 1,778 క్షీణించి రూ. 1,19,179 వద్ద ట్రేడయ్యింది.
మరోవైపు, పసిడిలో కరెక్షన్ కొనసాగే అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది 50 శాతానికి పైగా పెరిగిన నేపథ్యంలో మరో 5–10 శాతం క్షీణించవచ్చని పేర్కొన్నారు. బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీపై అందరూ ప్రధానంగా దృష్టి పెట్టారని మిరే అసెట్ షేర్‌ఖాన్ కమోడిటీస్, కరెన్సీస్ హెడ్ ప్రవీణ్ సింగ్ తెలిపారు.


