పసిడి రుణాల ఎన్‌బీఎఫ్‌సీలదే హవా.. | Gold-loan NBFCs maintain market share despite competition | Sakshi
Sakshi News home page

పసిడి రుణాల ఎన్‌బీఎఫ్‌సీలదే హవా..

Jan 4 2024 5:18 AM | Updated on Jan 4 2024 5:18 AM

Gold-loan NBFCs maintain market share despite competition - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి గట్టి పోటీ ఉంటున్నప్పటికీ పసిడి రుణాలిచ్చే నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) వ్యాపార కార్యకలాపాలు పటిష్టంగా సాగుతున్నాయి. కరోనా సమయంతో పోలిస్తే కాస్తంత తగ్గినా మార్కెట్లో అవి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటున్నాయి. క్రిసిల్‌ రేటింగ్స్‌ నివేదిక ప్రకారం 2021 మార్చి నుంచి 2023 సెపె్టంబర్‌ మధ్య కాలంలో మార్కెట్‌ పరిమాణం రూ. 2.5 లక్షల కోట్లకు చేరగా, వాటి మార్కెట్‌ వాటా 61 శాతంగా నమోదైంది.

కరోనా విస్తృతంగా ఉన్న 2022 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ పరిమాణం దాదాపు రూ. 2 లక్షల కోట్లుగా ఉండగా, పసిడి రుణాల ఎన్‌బీఎఫ్‌సీల వాటా 64 శాతంగా ఉండేది. ఆ తర్వాత 2023 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ రూ. 2.3 లక్షల కోట్లకు చేరగా, వాటి వాటా 62 శాతానికి పరిమితమైంది. మార్కెట్లో మూడింట రెండొంతుల వాటా ప్రైవేట్‌ సంస్థలదే ఉన్నప్పటికీ.. అత్యధికంగా పసిడి రుణాలిచి్చన సంస్థగా (రూ. 1.3 లక్షల కోట్లు) ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు ఉంది.  

వాటా పెంచుకుంటున్న బ్యాంకులు..
బ్యాంకులు కూడా క్రమంగా పసిడి రుణాల మార్కెట్లో తమ వాటాను పెంచుకుంటున్నాయి. రూ. 2.5 లక్షల కోట్ల మార్కెట్లో 39 శాతం వాటాను (1 శాతం వృద్ధి) దక్కించుకున్నాయి. అలాగే, గత మూడేళ్లుగా వ్యవసాయేతర బంగారు రుణాలపై.. ముఖ్యంగా రూ. 3 లక్షల పైబడిన లోన్స్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి.

కొత్త ప్రాంతాల్లో మరిన్ని శాఖలను ఏర్పాటు చేయడం, ఆన్‌లైన్‌లో రుణాలివ్వడం, ఇంటి వద్దకే సర్వీసులు అందించడం వంటి వ్యూహాలతో పసిడి రుణాల ఎన్‌బీఎఫ్‌సీలు ముందుకెడుతున్నట్లు క్రిసిల్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ బి. మాళవిక తెలిపారు. బంగారం ధరల పెరుగుదల కూడా ఎన్‌బీఎఫ్‌సీల పోర్ట్‌ఫోలియో వృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి.

ఎన్‌బీఎఫ్‌సీల గోల్డ్‌ లోన్స్‌ ఏయూఎం వృద్ధికి ప్రధానంగా మూడు కారణాలు ఉంటున్నాయని క్రిసిల్‌ పేర్కొంది. కస్టమర్లు చేజారిపోకుండా ఎన్‌బీఎఫ్‌సీలు తగు ప్రయత్నాలు చేస్తుండటం, చిన్న..మధ్య స్థాయి రుణాలపై దృష్టి పెట్టడం, శాఖల నెట్‌వర్క్‌ను పెంచుకోవడం ద్వారా కస్టమర్లకు మరింత చేరువయ్యే ప్రయత్నాలు చేస్తుండటం ఇందుకు దోహదపడుతున్నట్లు
వివరించింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement