బంగారం రుణాలకు డిమాండ్‌ పైపైకి.. | Gold loan demand India NBFCs growth | Sakshi
Sakshi News home page

బంగారం రుణాలకు డిమాండ్‌ పైపైకి..

May 30 2026 10:00 AM | Updated on May 30 2026 10:15 AM

Gold loan demand India NBFCs growth

ముంబై: రుణదాతలకు పసిడి రుణాలు ఇక ముందూ కీలక ప్రాధాన్యంగా కొనసాగుతాయని ఎక్స్‌పీరియన్‌ నివేదిక తెలిపింది. భారత రిటైల్‌ రుణ మార్కెట్లో సెక్యూర్డ్‌ రుణాలకు ప్రాధాన్యం పెరిగినట్టు పేర్కొంది. పసిడి రుణాల సోర్సింగ్‌ విలువ (కొత్త రుణాలు) 2025–26 క్యూ4లో రెట్టింపునకు పైగా పెరిగి రూ.7.6  లక్షల కోట్లకు చేరినట్టు తెలిపింది. నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) 47 శాతం పెరిగి రూ.11.9 లక్షల కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది.

సగటు రుణ పరిమాణం రూ.1.4 లక్షల నుంచి రూ.2.1 లక్షలకు చేరినట్టు వెల్లడించింది. ఇదే ధోరణి కొనసాగితే ఇక మీదటా తనఖా రుణాలు రిటైల్‌ రుణాల వృద్ధిలో కీలకంగా ఉంటాయని ఈ నివేదిక తెలిపింది. 2025–26లో కొత్త రుణాల్లో 68 శాతం సెక్యూర్డ్‌ రూపంలోనే ఉన్నాని, మొత్తం అన్‌సెక్యూర్డ్‌ రుణాల్లో 22 శాతం వృద్ధితో పోల్చితే ఎంతో ఎక్కువని వివరించింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) పసిడి రుణాల డిమాండ్‌ నుంచి ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నట్టు తెలిపింది.

2025–26 క్యూ4లో కొత్త రుణాల్లో 40 శాతం ఎన్‌బీఎఫ్‌సీల నుంచే ఉన్నట్టు వెల్లడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 28 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. ఇదే కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకుల వాటా మోస్తరు స్థాయిలోనే కొనసాగినట్టు వివరించింది. బంగారం రుణాల ఆస్తుల నాణ్యత సైతం మెరుగ్గా ఉందంటూ.. 90 రోజులకు పైన చెల్లింపుల్లేని రుణాల వాటా 0.3 శాతం నుంచి 0.2 శాతానికి తగ్గినట్టు ఎక్స్‌పీరియన్‌ నివేదిక వెల్లడించింది.   

Advertisement
 
Advertisement
Advertisement