
ఏఐ ఆధారిత డ్రోన్ సొల్యూషన్స్ కోసం గుజరాత్, తమిళనాడు, ఝార్ఖండ్ రాష్ట్రాల ప్రభుత్వ విభాగాల నుంచి పలు కాంట్రాక్టులు లభించినట్లు డ్రోన్ టెక్నాలజీ సంస్థ గరుడా ఏరోస్పేస్ తెలిపింది. ఒరిస్సా మైనింగ్ కార్పొరేషన్‌తో ఒప్పందం ప్రకారం వార్షిక సర్వేల నిర్వహణ, గనుల మూసివేత ప్రణాళికల కోసం డిజిటల్ డేటాబేస్‌లను, సర్వే మ్యాప్‌లు మొదలైన వాటిని తయారు చేయాల్సి ఉంటుంది.
అలాగే గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, తమిళనాడుకు చెందిన జియాలజీ, మేనింగ్ డిపార్ట్‌మెంట్, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ టెండర్లను కూడా గరుడ ఏరోస్పేస్ దక్కించుకుంది. అటు ఝార్ఖండ్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ నుంచి కూడా కాంట్రాక్టు లభించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు అగ్నీశ్వర్ జయప్రకాష్ చెప్పారు.
తమ డ్రోన్ యాజ్ ఏ సర్వీస్(డాస్) మోడల్ వినియోగం పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోందని, తమ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునేందుకు ఈ కాంట్రాక్టులు తోడ్పడతాయని వివరించారు.