
న్యూఢిల్లీ: దాదాపు రూ. 231 కోట్లు స్వాహా చేశారన్న ఆరోపణలతో మాజీ సీఎఫ్‌వోపై ఆన్‌లైన్ గేమింగ్ సంస్థ గేమ్స్‌క్రాఫ్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్నాళ్లుగా ఆయన అనధికారిక ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు అందులో పేర్కొంది. వ్యక్తిగతంగా ఈక్విటీ, డెరివేటివ్స్ ట్రేడింగ్ కోసం కంపెనీ నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆయన ఓ ఈమెయిల్‌లో 'స్వచ్ఛందంగా అంగీకరించారు' అని గేమింగ్‌క్రాఫ్ట్ వెల్లడించింది.
సదరు ఉద్యోగిని ఈ ఏడాది మే నెలలో కంపెనీ తొలగించింది. మాజీ సీఎఫ్‌వో మోసం నేపథ్యంలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ. 4,009 కోట్ల ఆదాయంపై కంపెనీ లాభం రూ. 706 కోట్లకు పరిమితమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
28 శాతం జీఎస్‌టీ శ్లాబు కింద పూర్తి ఆర్థిక సంవత్సరానికి పన్నులు కట్టాల్సి రావడంతో పాటు సుమారు రూ. 231 కోట్ల మొత్తాన్ని ఖాతాల్లో సర్దుబాటు చేయాల్సి రావడం వల్ల లాభం తగ్గినట్లు కంపెనీ పేర్కొంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 3,475 కోట్లు కాగా లాభం రూ. 947 కోట్లుగా నమోదైంది. 2017లో ఏర్పాటైన గేమ్స్‌క్రాఫ్ట్ దశాబ్దం కన్నా తక్కువ వ్యవధిలోనే దేశీయంగా గేమింగ్ రంగ దిగ్గజంగా ఎదిగింది.