వీఐపీ సంస్కృతిపై నిరసన | Fuel Price Hike Sparks Debate Over VIP Culture After Viral Overcrowded Train Video, Read Story For More Details | Sakshi
Sakshi News home page

వీఐపీ సంస్కృతిపై నిరసన

May 12 2026 12:11 PM | Updated on May 12 2026 12:44 PM

Fuel Crisis Public Fury Viral Train Video Exposes VIP Culture Divide in India

పెరుగుతున్నచమురు ధరలు, రవాణా కష్టాల నేపథ్యంలో సామాన్య పౌరుడి అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఒకవైపు చమురు వినియోగాన్ని తగ్గించాలని, విలాసాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో సామాన్యులు కనీస ప్రయాణ సౌకర్యాల కోసం పశువుల్లా కొట్టుకోవాల్సి వస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ఈ చర్చను మరోసారి తీవ్రతరం చేసింది.

‘మేము ఇంధనాన్ని వృధా చేయడం లేదు'

సోషల్ మీడియా వేదిక ఎక్స్‌(గతంలో ట్విట్టర్) వేదికగా అనురాధ తివారీ అనే యూజర్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశమైంది. కిక్కిరిసిన రైలులోకి ప్రవేశించడానికి ప్రయాణికులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న దృశ్యాలను ఆమె పోస్ట్ చేశారు. ‘సామాన్య ప్రజలు ఇంధనాన్ని వృధా చేయడం లేదు. ఎన్నికల ర్యాలీలు, కిలోమీటర్ల పొడవున వీఐపీ కాన్వాయ్‌ల్లో, వందలాది కార్లతో ఇంధనాన్ని వృధా చేసేది రాజకీయ నాయకులే. ఈ వీఐపీ సంస్కృతికి స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ఆమె ఘాటుగా స్పందించారు.

ప్రజల అసహనం

చమురు దిగుమతులను తగ్గించి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసే క్రమంలో.. ప్రజలు ఇంధనాన్ని పొదుపు చేయాలని, వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. అయితే, ప్రభుత్వ విజ్ఞప్తులు కేవలం సామాన్యులకేనా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

సోషల్ మీడియా స్పందనలు

‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునే మన దేశంలో సామాన్యులను పశువుల్లాగా, ఉన్నత వర్గాలను రాజుల్లా చూస్తున్నారు’ అని ఒక యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను ప్రత్యక్ష, పరోక్ష పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నాను. ప్రతిఫలంగా నా కుటుంబంతో ఇలాంటి నరకప్రాయమైన ప్రయాణం చేయాలా?’ అని మరొకరు నిలదీశారు. వీఐపీ సంస్కృతిని రద్దు చేయడంతోపాటు రాజకీయ నాయకులను సేవకులుగా చూసేలా ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పు రావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

వాస్తవ పరిస్థితులు - సవాళ్లు

వార్తా విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, దేశంలో ప్రజా రవాణా వ్యవస్థపై ఒత్తిడి విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా భారతీయ రైల్వేలో జనరల్, స్లీపర్ క్లాస్ బోగీల సంఖ్య తగ్గిపోవడం, రద్దీ పెరగడం సామాన్యులకు శాపంగా మారింది. అభివృద్ధి చెందిన దేశాల్లో మంత్రులు, ఉన్నతాధికారులు సైతం సామాన్య ప్రజలతో కలిసి రైళ్లలో ప్రయాణించే సంప్రదాయం ఉంది. మన దేశంలో మాత్రం వీఐపీ అంటేనే ప్రత్యేకమైన ప్రోటోకాల్, సామాన్యులకు ఇబ్బంది కలిగించే ట్రాఫిక్ ఆంక్షలుగా మారిపోయింది. ఇంధన పొదుపు మంత్రం కేవలం సామాన్యుడికే కాకుండా, పాలకులకు కూడా వర్తించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నది మేధావులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి!

Advertisement
 
Advertisement
Advertisement