
గత ఆర్థిక సంవత్సరంలో ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇండియా నష్టం మరింత పెరిగి రూ. 5,189 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టాలు రూ. 4,248 కోట్లుగా నమోదయ్యాయి. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం టోఫ్లర్ ప్రకారం.. తాజాగా ఆదాయం రూ. 70,542 కోట్ల నుంచి 17 శాతం పెరిగి రూ. 82,787 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు 17 శాతం పెరిగి రూ. 88,121 కోట్లకు చేరాయి.
మింత్రా లాభం జూమ్..
ఫ్యాషన్, లైఫ్‌స్టయిల్ ఈ–కామర్స్ సంస్థ మింత్రా డిజైన్స్ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 548 కోట్ల లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 31 కోట్లతో పోలిస్తే ఇది అనేక రెట్లు అధికం కావడం గమనార్హం. మరోవైపు, సమీక్షాకాలంలో సంస్థ ఆదాయం రూ. 5,122 కోట్ల నుంచి 18 శాతం వృద్ధి చెంది రూ. 6,043 కోట్లకు చేరింది.