మాజీ ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్.. టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించారు. ట్విటర్ (ఎక్స్)లో ఉద్యోగం కోల్పోయిన తరువాత.. ఆయన స్థాపించిన కృత్రిమ మేధస్సు (AI) స్టార్టప్ 'ప్యారలల్ వెబ్ సిస్టమ్స్' భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తూ వేగంగా ఎదుగుతోంది. తాజా నిధుల సమీకరణ తర్వాత 2 బిలియన్ డాలర్ల (రూ. 19,020 కోట్లు) విలువను చేరుకుంది.
సీక్వోయా క్యాపిటల్ నేతృత్వంలో జరిగిన సిరీస్ బీ రౌండ్‌లో.. ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ 100 మిలియన్ డాలర్లు (రూ. 951 కోట్లు) సమీకరించింది. ఈ రౌండ్‌లో క్లైనర్ పెర్కిన్స్, ఇండెక్స్ వెంచర్స్, ఖోస్లా వెంచర్స్, ఫస్ట్ రౌండ్ క్యాపిటల్, స్పార్క్ క్యాపిటల్, టెర్రైన్ క్యాపిటల్ వంటి పెట్టుబడిదారులు కూడా పాల్గొన్నారు.
ఐదు నెలల క్రితం, ఈ స్టార్టప్ 740 మిలియన్ డాలర్ల (రూ.7,037 కోట్లు) వాల్యుయేషన్‌తో సిరీస్ ఎ ఫండింగ్‌లో 100 మిలియన్ డాలర్ల (రూ.951 కోట్లు) నిధులను సమీకరించింది. కాగా తాజా పెట్టుబడితో, కంపెనీ సమీకరించిన మొత్తం నిధులు ఇప్పుడు 230 మిలియన్ డాలర్లకు (రూ.2,187 కోట్లు) చేరాయి.
ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ అనేది AI ఏజెంట్ల కోసం రూపొందించిన సాధనాలను నిర్మిస్తుంది, ఆటోమేటెడ్ సిస్టమ్‌లకు అనుగుణంగా వెబ్ సెర్చ్, రీసెర్చ్ APIలను అందిస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే నోషన్, ఓపెన్‌డోర్, క్లే, హార్వే వంటి ప్రముఖ క్లయింట్లను ఆకర్షించింది. ఇది బ్యాంకులు, హెడ్జ్ ఫండ్‌లకు కూడా సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే నిర్దిష్ట పేర్లను వెల్లడించలేదు.
తమ ప్లాట్‌ఫామ్‌ను లక్షకు పైగా డెవలపర్లు ఉపయోగిస్తున్నారని, ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ అని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ ఎకోసిస్టమ్‌లో.. ఈ సంస్థ కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ ఎకోసిస్టమ్‌లో ఈ సంస్థ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఐటీ రంగాన్ని మార్చనున్న ఏఐ: ఇన్ఫోసిస్ సీఈఓ
2022లో ట్విటర్ (ఎక్స్) సంస్థను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తరువాత.. పరాగ్ అగర్వాల్ తన సీఈఓ పదవిని వీడాల్సి వచ్చింది. ఆ తరువాత ఆయనతో పాటు ఇతర మాజీ అధికారులు 128 మిలియన్ డాలర్ల పరిహారం కోసం కేసు వేశారు. ఆ తర్వాత అక్టోబర్‌లో ఇది గోప్యంగా పరిష్కారమైంది. కాగా.. ఇప్పుడు ఓ స్టార్టప్ కంపెనీతో పరాగ్ దూసుకెళ్తున్నారు.


