గోల్డ్‌ ఎక్సేంజ్‌ ఏర్పాటు.. విధి విధానాలు ఇలా ఇవే | Finance Ministry Recognised Electronic Gold Receipts As Securities | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీప్ట్‌లకు సెక్యూరిటీల హోదా

Dec 28 2021 9:01 AM | Updated on Dec 28 2021 9:05 AM

Finance Ministry Recognised Electronic Gold Receipts As Securities - Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీప్ట్‌ (ఈజీఆర్‌)లను ‘సెక్యూరిటీల కాంట్రాక్టుల చట్టం 1956’ కింద గుర్తిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటయ్యే గోల్డ్‌ ఎక్సేంజ్‌ల్లో ఈజీఆర్‌ల ట్రేడింగ్‌కు దారిచూపినట్టయింది. ఇప్పటికే ఉన్న ఎక్సేంజ్‌ల్లో ప్రత్యేక కేటగిరీ కింద వీటిల్లో ట్రేడింగ్‌కు అవకాశం ఉంటుంది. షేర్ల మాదిరే ఈజీఆర్‌లను డీమ్యాట్‌ ఖాతాల్లో ఉంచుకోవచ్చు. అవసరమైనప్పుడు వీటిని భౌతిక బంగారంగాను మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. సెక్యూరిటీల మాదిరే ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్‌మెంట్‌కు అర్హత లభిస్తుంది. సెబీ నిబంధనల ప్రకారం భౌతిక బంగారాన్ని డిపాజిట్‌ చేసి ఈజీఆర్‌లను పొందొచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2021–22 బడ్జెట్‌ సందర్భంగా ఈజీఆర్‌లపై సెబీ నియంత్రణ సంస్థగా వ్యవహరిస్తుందని.. వేర్‌హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేటరీ అథారిటీ కమోడిటీ మార్కెట్‌ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తుందని ప్రకటించడం గమనార్హం.  

ఎక్సేంజ్‌ ఏర్పాటుకు మార్గం సుగమం 
బంగారం ఎక్సేంజ్‌ను ఏర్పాటు చేసేందుకు సెబీ ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఆమోదం తెలియజేసింది. ఈ ఎక్సేంజ్‌లో బంగారం ఈజీఆర్‌ల రూపంలోనే ట్రేడవుతుంది. ప్రస్తుత లేదా కొత్తగా ఏర్పాటు చేసే ఎక్సేంజ్‌లు ఏవైనా ఈజీఆర్‌లో ట్రేడింగ్‌ను ప్రత్యేక విభాగం కింద చేపట్టొచ్చని సెబీ ప్రకటించింది. ఎంత పరిమాణం చొప్పున ఈజీఆర్‌లలో ట్రేడింగ్, ఈజీఆర్‌లను బంగారంగా మార్పిడి చేసుకునేందుకు అనుమతించడం అనేది ఎక్సేంజ్‌ల ఇష్టానికే విడిచిపెట్టింది. బంగారం ఎక్సేంజ్‌ ఏర్పాటుతో దేశంలో సహేతుక బంగారం ధరలు, పెట్టుబడులకు లిక్విడిటీ, బంగారం నాణ్యతకు హామీ లభిస్తుందని సెబీ భావిస్తోంది. ఈజీఆర్‌లను ఇన్వెస్టర్‌ తనకు నచ్చినంత కాలం షేర్ల మాదిరే ఉంచుకోవచ్చు. వద్దనుకుంటే ఈజీఆర్‌లను స్వాధీనం చేసి, ఖజానాల్లో అండర్‌లైయింగ్‌ (హామీగా)గా ఉండే బంగారాన్ని తిరిగి పొందొచ్చు. వీటికి అయ్యే వ్యయాలు కూడా తక్కువగానే ఉంటాయని సెబీ తెలిపింది.  

సెబీ పర్యవేక్షణ 
ఈజీఆర్‌లకు అండర్‌లైయింగ్‌గా ఉంచే భౌతిక బంగారం వాల్ట్‌లపై సెబీ నియంత్రణ, పర్యవేక్షణ ఉంటాయి. ఆయా సంస్థలు సెబీ వద్ద రిజిస్టర్‌ చేసుకోవడం తప్పనిసరి. వాల్ట్‌ మేనేజింగ్‌ సేవలు అందించడానికి.. అంటే బంగారాన్ని ఈజీఆర్‌లుగా మార్చి సెక్యూరిటీల జారీకి సెబీ అనుమతి పొందాల్సి ఉంటుంది. బంగారం డిపాజిట్, నిల్వ, భద్రత, ఈజీఆర్‌లను వెనక్కి తీసుకుని భౌతిక బంగారాన్ని అప్పగించడం ఇవన్నీ వాల్ట్‌ సర్వీసుల్లో భాగంగా ఉంటాయి. నిర్ణీత కాలానికోసారి ఈజీఆర్‌లు, వాటికి సంబంధించి బంగారం నిల్వలను  ఆడిట్‌ చేయించుకోవాలి. 
 

చదవండి:హాల్‌మార్కింగ్‌ విధాన విస్తరణకు కసరత్తు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement