ఫేస్‌బుక్‌ సమర్పించు.. వరల్డ్‌రూమ్‌

Facebook Introducing Horizon Workrooms - Sakshi

కరోనా భయం నీడలా వెంటాడుతూనే ఉన్న నేపథ్యంలో ప్రముఖ సంస్థలు కొన్ని ‘ఫిజికల్‌ వర్క్‌స్పేస్‌ ముఖ్యం కాదు’ అంటున్నాయి. ‘వర్చువల్‌ మీటింగ్‌’కు జై కొడుతున్నాయి. వర్చువల్‌ మీటింగ్‌ సాఫ్ట్‌వేర్‌లకు మంచి మార్కెట్‌ ఉన్న ఇలాంటి సమయంలో ‘నేనున్నానని’ అంటూ హరైజన్‌ వర్క్‌రూమ్స్‌ బీటాతో ముందుకు వచ్చింది బిగ్గెస్ట్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌.

చాలా కాలంగా వీఆర్‌ (వర్చువల్‌ రియాలిటీ) –ఏఆర్‌ (ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ) మీద దృష్టి పెట్టిన ఫేస్‌బుక్‌కు ‘హరైజన్‌ రూమ్స్‌’ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా మారింది. ‘ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితం చూపించాలనేది మా ప్రయత్నం’ అంటున్నాడు సీయివో మార్క్‌ జుకర్‌ బర్గ్‌. హరైజన్‌ వర్క్‌రూమ్స్‌ ఉపయోగించడానికి ‘వర్క్‌రూమ్‌’ ఎకౌంట్‌తో పాటు ఓకులస్‌ క్వెస్ట్‌ హెడ్‌సెట్‌ తప్పనిసరి. అవతార్‌ వెర్షన్‌లో గ్రూప్‌ మీటింగ్‌లు నిర్వహించుకోవచ్చు. ఎక్కడో ఉన్నవారితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నట్లు కాకుండా అందరూ ఒకేచోట, ఒకేగదిలో ఉన్నట్లుగా ఉంటుంది. జర్నలిస్ట్‌ ఎలెక్స్‌ హీత్‌ హరైజన్‌ రూమ్స్‌ గురించి ఇలా అంటున్నారు...

మార్క్‌ జుకర్‌బర్గ్‌  ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు హాజరయ్యాను. అయితే ఇది వీఆర్‌ కాన్ఫరెన్స్‌. యు–ఆకారంలోని టేబుల్‌ చుట్టూ నాతో పాటు ఎందరో రిపోర్టర్లు కూర్చున్నారు. జుకర్‌బర్గ్‌ అవతార్‌ మా ముందు ప్రత్యక్షమయ్యాడు. హరైజన్‌ వర్క్‌రూమ్స్‌ న్యూ యాప్‌ను పరిచయం చేశాడు. అందరం ఒకేదగ్గర, ఒకే చోట ఉన్నట్లుగా అనిపించింది. ఇదొక అద్భుతమైన అనుభవం. వీఆర్‌ ఎక్స్‌పీరియన్స్‌ కిక్‌ ఇచ్చింది. రాబోయే రోజుల్లో వీఆర్‌ ప్రేమికులను మాత్రమే కాదు దాని గురించి అంతగా తెలియని వారిని కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ ఆకట్టుకుంటుంది’

‘ప్రపంచంలో ఆ మూల ఒకరు, ఈ మూల ఒకరు ఉండవచ్చు. ఎక్కడెక్కడో ఉన్న అందరినీ ఒకే రూమ్‌లోకి తీసుకువస్తున్నాం. ఇది సృజనాత్మక ఆలోచనలకు విశాలమైన వేదిక. ప్రయోగాల కేంద్రం’ అంటుంది ఫేస్‌బుక్‌ ప్రచార వీడియో.‘ఏ ప్లేస్‌ టు ట్రై సమ్‌థింగ్‌ న్యూ’ అని నొక్కి వక్కాణిస్తుంది. ఆ కొత్తదనం అనుభవంలోకి రావడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుందేమోగానీ... హరైజన్‌ వర్క్‌రూమ్స్‌పై చాలా అంచనాలే ఉన్నాయి. స్పెషియల్‌ హలిగ్రాఫిక్‌ కొలబొరేషన్‌ ప్లాట్‌ఫా మ్‌కు ఇది ఏ రకంగా భిన్నమైనదో వేచిచూద్దాం.
 
మెటవర్స్‌ అంటే?
జుకర్‌బర్గ్‌ మాటల్లో ‘మెటవర్స్‌’ ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఇంతకీ ఏమిటీ మెటవర్స్‌? స్థూలంగా చెప్పాలంటే... కలెక్టివ్‌ వర్చువల్‌ షేర్‌డ్‌ స్పేస్‌. నీల్‌ స్టీఫెన్‌సన్‌ తన సైన్స్‌–ఫిక్షన్‌ నవల ‘స్నో క్రాష్‌’లో ఈ పదాన్ని ఉపయోగించారు. ఈ నవలలో మనుషులు ‘అవతార్‌’ల ఆకారంలో ఒకరితో ఒకరు ఇంటరాక్ట్‌ అవుతుంటారు. గ్రీకు పదం ‘మెటా’ (అవతలి వైపు)కు ప్రత్యామ్నాయం మెటవర్స్‌. ఇక ఫేస్‌బుక్‌ విషయానికి వస్తే... మెటవర్స్‌కు కంటెంట్‌ సర్వీసెస్, ఇంటర్‌ఛేంజ్‌ టూల్స్, స్టాండర్డ్స్, వర్చువల్‌ ప్లాట్‌ఫామ్స్, నెట్‌వర్కింగ్‌ కంప్యూట్, హార్డ్‌వేర్‌... అనేవి మూలస్తంభాలు.

చదవండి : గాడ్జెట్స్‌ మార్కెట్‌ జోరు,ఎక్కువగా ఏం కొంటున్నారంటే?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top