
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' భారతదేశంపైన 50 శాతం సుంకాలను ప్రకటించారు. ఇది భారత ఆర్ధిక వ్యవస్థ మీద ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ సుంకం (టారిఫ్) అంటే ఏమిటి?, అది దేశ ఆర్ధిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
సుంకం అంటే?
సుంకం అంటే పన్ను. దీన్ని ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధిస్తుంది. దీనివల్ల వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువుల ధరలు చౌకగా కాకుండా ఉండటానికి.. ఆ దేశ ప్రభుత్వం ఈ సుంకాలను విధిస్తుంది.
దేశ ఆర్ధిక వ్యవస్థపై సుంకాల ప్రభావం..
ట్రంప్ భారతదేశంపై విధించిన 50 శాతం సుంకాల వల్ల.. ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్త్రాలు, ఇనుము, ఉక్కు, ఫార్మా, బంగారం మొదలైన వాటి ధరలు పెరుగుతాయి. వీటి ధరలు పెరిగితే అక్కడ డిమాండ్ తగ్గుతుంది. ఇది ఇండియన్ కంపెనీలపై ప్రభావం చూపుతుంది. క్రమంగా ఎగుమతులు తగ్గుతాయి. తద్వారా విదేశీ మారకద్రవ్యం కూడా తగ్గుతుంది. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థ మీద కొంతవరకు ప్రభావాన్ని చూపుతుంది.
సుంకాలు విధించడం వల్ల ప్రయోజనాలు
సుంకాలు విధించడం వల్ల దేశీయ వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. విదేశీ వస్తువుల ధరలు అధికంగా కావడంతో ప్రజలు స్వదేశీ ఉత్పత్తుల మీదనే మొగ్గు చూపుతారు. ఇది దేశీయ పరిశ్రమలను బలపరుస్తుంది, కర్మాగారాల సంఖ్య కూడా పెంచుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ఇదీ చదవండి: మేడ్ ఇన్ ఇండియా రాఖీలదే హవా.. ఏకంగా రూ.17000 కోట్ల బిజినెస్
సుంకాల వల్ల ప్రతికూల ప్రభావం
ఒక దేశం ఇతర దేశాలపై భారీ సుంకాలను విధిస్తే.. ఆ దేశం కూడా అదే స్థాయిలో సుంకాలను విధిస్తుంది. తద్వారా ఆ దేశం వస్తువుల ధరలు కూడా ఇతర దేశాల్లో పెరుగుతాయి. ఇది వాణిజ్య యుద్దానికి దారితీసే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా భారతదేశంలో 50 శాతం సుంకాలను ప్రకటించింది. ఇండియా కూడా అమెరికాకు ధీటుగా సుంకాలను పెంచే అవకాశం ఉంది.