
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈ ఏడాది.. తన చందాదారుల కోసం కొన్ని కీలక మార్పులు చేసింది. ఇవన్నీ ఉద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ కథనంలో ఈపీఎఫ్ఓలో 2025లో జరిగిన ఐదు కీలక మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.
ప్రొఫైల్ అప్‌డేట్
ఈ ఏడాది ఈపీఎఫ్ఓలో జరిగిన ప్రధానమైన మార్పులలో ప్రొఫైల్ అప్‌డేట్ ఒకటి. ఈ అప్డేట్ ద్వారా.. ప్రొఫైల్ అప్డేట్ చాలా సులభతరమైపోయింది. మీ యూఏఎన్ నెంబర్.. ఆధార్‌తో లింక్ అయి ఉంటే.. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, లింగం, నేషనాలిటీ, వైవాహిక స్థితి, జీవిత భాగస్వామి పేరు, ఉద్యోగం ప్రారంభించిన తేదీ వంటి వివరాలను ఎటువంటి పత్రాలతో అవసరం లేకుండానే అప్డేట్ చేసుకోవచ్చు.
పీఎఫ్ బదిలీ
గతంలో, ఉద్యోగాలు మారినప్పుడు పీఎఫ్ బదిలీ చేయడం.. చాలా సుదీర్ఘమైన ప్రక్రియగా ఉండేది. ఇప్పుడిది.. చాలా సులభమైపోయింది. పీఎఫ్ బదిలీకి పాత లేదా కొత్త యజమాని ఆమోదం అవసరం లేదు. దీంతో పీఎఫ్ డబ్బు కొత్త ఖాతాకు వేగంగా.. సులభంగా బదిలీ అవుతుంది.
జాయింట్ డిక్లరేషన్
జనవరి 16, 2025 నుంచి వర్తించే కొత్త నిబంధనల ప్రకారం.. ఈపీఎఫ్ఓ జాయింట్ డిక్లరేషన్ ప్రక్రియ డిజిటల్‌గా మారింది. మీ యూఏఎన్ ఆధార్‌తో లింక్ అయి ఉంటే.. జాయింట్ డిక్లరేషన్‌ను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయవచ్చు.
పెన్షన్ పేమెంట్స్
ఈపీఎఫ్ఓ జనవరి 1, 2025 నుంచి కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ (CPPS)ను ప్రారంభించింది. దీని కింద ఇప్పుడు పెన్షన్ 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' ప్లాట్‌ఫామ్ ద్వారా నేరుగా ఏదైనా బ్యాంకు ఖాతాకు పంపడం జరుగుతుంది. గతంలో పెన్షన్ చెల్లింపు ఆర్డర్‌లను ఒక ప్రాంతీయ కార్యాలయం నుంచి మరొక ప్రాంతీయ కార్యాలయానికి బదిలీ చేయాల్సి వచ్చింది. దీని వల్ల పెన్షన్ చెల్లింపు ఆలస్యం అయ్యేది. ఇప్పుడు ఈ విధానం పూర్తిగా రద్దు అయింది.
ఇదీ చదవండి: 'అమెరికాలో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక'
జీతంపై పెన్షన్ ప్రక్రియ
అధిక జీతంతో పెన్షన్ పొందాలనుకునే ఉద్యోగుల కోసం.. ఈపీఎఫ్ఓ ఇప్పుడు మొత్తం ప్రక్రియను సులభతరం చేసింది. ఇప్పుడు అందరికీ ఒకే విధమైన పద్ధతిని అవలంబించనున్నారు. ఒక ఉద్యోగి జీతం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువగా ఉండి, దానిపై పెన్షన్ కోరుకుంటే ఈ విధానం ఉపయోగపడుతుంది. దీనితో పాటు, ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని లేదా వారి స్వంత ప్రైవేట్ ట్రస్ట్ పథకాన్ని నిర్వహించని సంస్థలు కూడా ట్రస్ట్ నియమాల ప్రకారం ఈ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది.