ఎలక్ట్రిక్‌ బైక్‌.. రయ్‌ రయ్‌! | Electric Motorcycle Demand and Growth Says Vahan Data | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ బైక్‌.. రయ్‌ రయ్‌!

Apr 14 2026 5:35 AM | Updated on Apr 14 2026 5:35 AM

Electric Motorcycle Demand and Growth Says Vahan Data

2025–26లో అమ్మకాలు 28 శాతం అప్‌ 

మార్కెట్లోకి కొత్త వాహనాల వెల్లువ 

పోటీపడుతున్న పాత, కొత్త కంపెనీలు

న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్స్‌పై డిమాండ్‌ పెరుగుతోంది. వాహన్‌ డేటా ప్రకారం 2025–26 ఆర్థిక సంవత్సరంలో 17,173 వాహనాలు అమ్ముడయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన 13,430 యూనిట్లతో పోలిస్తే 28 శాతం పెరిగాయి. పరిమాణం తక్కువగానే ఉన్నప్పటికీ, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉండేలా పాత, కొత్త సంస్థలు మార్కెట్లోకి ఆకర్షణీయమైన కొత్త వాహనాలను ప్రవేశపెట్టడంలో పోటీపడుతుండటంతో కస్టమర్లలో వీటిపై ఆసక్తి పెరుగుతోంది. 

ఒబెన్‌ ఎలక్ట్రిక్, రివోల్ట్‌ మోటార్స్, అ్రల్టావయోలెట్‌ ఆటోమోటివ్, మ్యాటర్‌ మోటార్‌లాంటి సంస్థలు ముఖ్యంగా పనితీరు, టెక్నాలజీ, విశిష్టమైన రైడింగ్‌ అనుభూతిపై దృష్టి పెడుతూ వినూత్నమైన మోడల్స్‌ని అందిస్తున్నాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కూడా ఫ్లయింగ్‌ ఫ్లీతో రంగంలోకి దిగింది. సంప్రదాయ ఇంజిన్ల మోటార్‌సైకిల్స్‌నే ఇష్టపడే రైడర్లు క్రమంగా ఎలక్ట్రిక్‌ ఆప్షన్లను కూడా పరిశీలిస్తున్నారని మ్యాటర్‌ మోటార్‌ వ్యవస్థాపకుడు మోహల్‌ లాల్‌భాయ్‌ తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనానికి మళ్లడాన్ని, పనితీరు విషయంలో రాజీపడటంలాగా కాకుండా అప్‌గ్రేడ్‌ కావడంగా పరిగణిస్తున్నారని వివరించారు.  

నిర్వహణ ఖర్చు తక్కువ..   
వాహన కొనుగోలు, నిర్వహణ వ్యయాలు మొదలైన వాటికి సంబంధించిన టోటల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఓనర్‌íÙప్‌ (టీసీవో) అనేది సాధారణ మోటార్‌సైకిల్స్, ఈ–బైక్స్‌కి దాదాపు సరిసమాన స్థాయికి చేరుతోందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. రన్నింగ్‌ వ్యయాలు, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటమనేది ఈ–మోటార్‌సైకిల్స్‌కి ఆదరణ పెరగడానికి తోడ్పడుతోందని వివరించాయి. రోజుకు 30–50 కి.మీ. రైడ్‌ చేసే వారు, పెట్టిన పెట్టుబడి 18–24 నెలల్లో తిరిగి వచ్చేయగలదని పేర్కొన్నాయి. పనితీరు, ఆదాకి సంబంధించి రెండింటి మధ్య ఏదో ఒక దాని విషయంలో రాజీపడాల్సిన అవసరం ఉండటం లేదని తెలిపాయి.

 అయితే, డిమాండ్‌–సరఫరా మధ్య అంతరాలు, నాణ్యతను కూడా పాటిస్తూ భారీగా ఉత్పత్తి చేయడం, ముడి వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులు, పటిష్టమైన నెట్‌వర్క్‌ని నిర్మించుకోవడంలాంటివి పరిశ్రమకు సవాళ్లుగా ఉంటున్నాయని లాల్‌భాయ్‌ తెలిపారు. తయారీ సామర్థ్యాలు, చార్జింగ్‌ సదుపాయాలు మెరుగుపడటంలాంటి అంశాలతో ఎలక్ట్రిక్‌ టూ–వీలర్ల సెగ్మెంట్‌ స్థిరంగా వృద్ధి చెందుతోందని ప్రైమస్‌ పార్ట్‌నర్స్‌ ఎండీ అనురాగ్‌ సింగ్‌ తెలిపారు. ఊహించిన దానికంటే వృద్ధి నెమ్మదిగానే ఉన్నా మరింత స్పష్టతతో పురోగమిస్తోందన్నారు. అయితే, మరో ఐదేళ్ల పాటు సంప్రదాయ ఇంజిన్‌ ద్విచక్ర వాహనాలకు ఆదరణ ఉంటుందని చెప్పారు.

ఓలా కొత్త స్కూటర్‌ ఎస్‌1 ఎక్స్‌ ప్లస్‌
320 కి.మీ రేంజ్‌ 
ధర రూ.1,29,999 
ముంబై: ఓలా ఎలక్ట్రిక్‌ కొత్తగా ఎస్‌1 ఎక్స్‌ ప్లస్‌ 5.2 కేడబ్ల్యూహెచ్‌ అనే కొత్త స్కూటర్‌ ను విడుదల చేసింది. దీని ధరను రూ.1,29,999గా నిర్ణయించింది. ఇందులో కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన 4680 భారత్‌ సెల్‌ టెక్నాలజీని వినియోగించింది. ఒక్కసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే 320 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. ఇందులో 11 కేడబ్ల్యూ మిడ్‌–డ్రైవ్‌ మోటార్, ఇంటిగ్రేటెడ్‌ మోటార్‌ కంట్రోల్‌ యూనిట్‌ (ఎంసీయూ) ఉన్నాయి. దీని గరిష్టం వేగం 125 కి.మీ. ఇందులో బ్రేక్‌–బై–వైర్‌ టెక్నాలజీతో పాటు ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌లు ఉన్నాయి. ఇవి రోజువారీ వినియోగంలో మెరుగైన కంట్రోల్, భద్రతను అందిస్తాయి.  ప్రీమియం మోడల్స్‌లో మాత్రమే ఉన్న అడ్వాన్స్‌ టెక్నాలజీని ప్రతి భారతీయుడికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని ఓలా ప్రతినిధి చెప్పారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement