ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర..అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్?!

E Commerce Giants Violating Fdi Norms Says Cait - Sakshi

న్యూఢిల్లీ: పుష్కలంగా నిధులు ఉన్న కొన్ని బహుళ జాతి (ఎంఎన్‌సీ) ఈ–కామర్స్‌ కంపెనీలు యధేచ్ఛగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) మార్గదర్శకాలను ఉల్లంఘించే ప్రయత్నం చేస్తున్నాయని దేశీ ట్రేడర్ల అసోసియేషన్‌ సీఏఐటీ ఆరోపించింది. ఇలాంటివి జరగకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ–కామర్స్‌ విధానంపై కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) ఈ మేరకు శ్వేతపత్రం విడుదల చేసింది.     

సాధారణంగా సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ ట్రేడింగ్‌ (ఎస్‌బీఆర్‌టీ), బీ2బీ క్యాష్‌ అండ్‌ క్యారీలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతులు ఉన్నాయి. అయితే, దేశీ రిటైలర్ల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ (ఎంబీఆర్‌టీ)లో మాత్రం  51 శాతం వరకూ కొన్ని షరతులు, ప్రభుత్వ అనుమతులకు లోబడి ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుందని కేంద్రం మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. చిన్న సంస్థలు, కిరాణాలకు సాంకేతికంగా తోడ్పడే ఉద్దేశంతో ఈ–కామర్స్‌ మార్కెట్‌ప్లేస్‌ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసేందుకు మాత్రం ఆటోమేటిక్‌ పద్ధతిలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. ఈ విధానంలో సదరు మార్కెట్‌ప్లేస్‌ సంస్థ .. తన ప్లాట్‌ఫామ్‌పై ఏ విక్రేత ఉత్పత్తులను నిల్వ ఉంచుకోవడానికి గానీ నియంత్రించడానికి గానీ అనుమతి ఉండదు. అలా చేస్తే మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ ట్రేడింగ్‌ కిందికి వస్తుంది.  

ఈ నిబంధనలను, కొన్ని బడా ఈ–కామర్స్‌ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని సీఏఐటీ ఆరోపించింది. విక్రేతలను లేదా నిల్వలను ప్రభావితం చేసే విధంగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయని, తద్వారా దర్యాప్తు ఏజెన్సీల నిఘా నుంచి తప్పించుకుంటున్నాయని పేర్కొంది. ఇది ఎఫ్‌డీఐ పాలసీ ఉల్లంఘన మాత్రమే కాదని, పోటీని దెబ్బతీసే ప్రయత్నం కూడా అని సీఏఐటీ వివరించింది. ‘ఇలాంటి పరిస్థితుల్లో చట్టాలను తూచా తప్పకుంటా అమలు చేయడం చాలా ముఖ్యం. లేకపోతే దేశీ తయారీ సంస్థలు, ట్రేడర్లు, విక్రేతలు, స్టార్టప్‌లు మొదలైన వాటన్నింటికి సమాన అవకాశాలు కల్పించాలన్న ఈ–కామర్స్‌ లక్ష్యానికి విఘాతం కలుగుతుంది‘ అని ఆందోళన వ్యక్తం చేసింది.

వినియోగదారుల ప్రయోజనాలకు ప్రాధాన్యం: కేంద్రం
ఆన్‌లైన్‌ వ్యాపార లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి బడా ఈ–కామర్స్‌ సంస్థల గుత్తాధిపత్యం నెలకొనే పరిస్థితి ఉండకూడదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ చెప్పారు. వినియోగదారులతో పాటు చిన్న రిటైలర్ల ప్రయోజనాలను పరిరక్షించేలా కొత్త విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. 

వినియోగదారుల వ్యవహారాల విభాగం, పరిశ్రమలు.. అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కలిసి ఓఎన్‌డీసీ (ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌) పేరిట ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి ప్రత్యేక సిస్టమ్‌ను రూపొందిస్తున్నాయని ఆయన తెలిపారు. మార్కెట్‌ప్లేస్‌ ప్లాట్‌ఫామ్‌లలో సెర్చి ఫలితాలు ఏ ఒక్కసంస్థ పక్షానో లేకుండా, తటస్థంగా ఉండేలా చూసేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు. తద్వారా సెర్చి ఫలితాలు ఏ ప్రాతిపదికన డిస్‌ప్లే అవుతున్నాయో వినియోగదారులకు స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top