అమెరికాలో ఎవరు మనోళ్లు.. ఎవరు పరాయి వాళ్లు?

Discrimination Of New Visa Holders In Usa - Sakshi

* మనలో మనకే ఇంత వివక్షా?
* "మనోళ్లు "" మనోళ్ళని " చిన్నచూపు చూస్తారా ? 

(చాలా కాలంగా అమెరికాలో స్థిరపడి అక్కడి సమాజాన్ని నిశితంగా పరిశీలించిన ఒక వ్యక్తికి కౌన్సిలింగ్ ఇస్తుంటే , ఆ వ్యక్తి నాతో పంచుకొన్న సమాచారం ఇది)

ఓ కుటుంబం ముప్పై అయిదేళ్ల క్రితమే అమెరికా కు వలసపోయారు. అక్కడే ఉన్నత విద్య, ఉద్యోగం, పిల్లలు.  ముందుగా వీసా .. అటుపై గ్రీన్ కార్డు .. అటుపై అమెరికా పౌరసత్వం . వారి పిల్లలు అక్కడే పుట్టారు-  జన్మతః  అమెరికా పౌరసత్వం. 

మరో కుటుంబం.. వీరు ఇటీవలే అమెరికాకు వెళ్లారు . ఇంకా వీసా పైనే వున్నారు. వారికో అమ్మాయి / అబ్బాయి. వీరిని పెళ్లి చేసుకొంటారా ? పెళ్లి దాక ఎందుకు ? వారు వీరిని చిన్న చూపు చూస్తారు. దగ్గరకు  కూడా రానివ్వరు. ఎందుకంటారా? వివరంగా మీరే చదవండి. 

ముప్పై / నలభై  ఏళ్ళ క్రితం అమెరికాకు  వలస పోయి,  ఇప్పుడు ఆ దేశ పౌరసత్వాన్ని సాధించిన వారు మేమే గొప్ప, ఉన్నతం అనుకొంటారు. చదువుకునేందుకు లేదా ఉద్యోగం చేసేందుకు వచ్చే వారిని చిన్న చూపు చూస్తారు. ఇలాంటి వారికి తమ  అబ్బాయి / అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడరు. సంబంధాలు చేసుకోరు.

పెద్ద వారికంటే,  అక్కడే పుట్టి అమెరికా పౌరసత్వాన్ని జన్మతః సాధించుకొన్న రెండవ తరం వారికి జాత్యహంకార భావన చాలా ఎక్కువ . తాము" బ్రౌన్ తోలు కలిగిన శ్వేత జాతీయులు "అనుకొంటారు.  అదేంటి?"  బ్రౌన్ తోలు కలిగిన తెల్ల జాతివారు"?  అనుకొంటున్నారా ? అవునండీ .. తమ తల్లితండ్రులు" ఆసియా నుండి వలస వచ్చారు కాబట్టి తమకు  ఇంకా బ్రౌన్ స్కిన్ ఉందని .. తాము వాస్తవంగా అంటే ఆలోచనల్లో ఆంగ్లం మాట్లాడే పద్దతిలో శ్వేతజాతీయులం అని వారు నమ్ముతారు. 

చదవండి: భారతీయ అమెరికన్ల విలువ పెంచిన ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా అజయ్‌ బంగా ఎన్నిక

వీసాపై వచ్చి అక్కడ ఉద్యోగం చేస్తున్న భారతీయులంటే వారికి చిన్న చూపు. 

కాలేజీలు, ఆఫీస్‌లలో ఈ బ్రౌన్ తోలు తెల్ల దొరలు ,  సాధారణ వీసాల వారితో కలవరు, దగ్గరకు రానివ్వరు. ఇక పెళ్లిళ్ల విషయానికి వస్తే బ్రౌన్ తోలు తెల్ల దొరలు , తమలాంటి బ్రౌన్  తోలు తెల్లదొరలనే పెళ్లి చేసుకొంటారు. వీసా వారు తక్కువ జాతివారు ; వారితో పెళ్లి సమస్యే లేదు . అక్కడి మ్యారేజ్ బ్యూరోల్లో " బ్రౌన్ తోలు తెల్ల దొరలకు" వేరే బ్యూరో .. "వీసా వారికి" వేరే బ్యూరో ఉంటుంది .

నేను ఒక ప్రశ్న అడిగాను. "అదేంటి అమెరికా దేశాన్ని జాతుల సంగమ దేశంగా పిలుస్తారు కదా ? అక్కడ జాతుల పేరు చెప్పడమే తప్పు . పైగా జాతి అంతరాలు మరచి పెళ్లిళ్లు కూడా చేసుకొంటున్నారు అనుకొంటున్నారా ? 

అవునండీ .. అది అసలే కాపిటలిస్ట్ దేశం . ప్రతి దానికి ఒక లెక్క ఉంటుందట. ఆ దేశంలో అత్యుత్తమ జాతి ఏది ?  శ్వేత జాతి కదా ? రెండో స్థానం బ్రౌన్ తోలు తెల్ల దొరలు / దొరసానులు . అంటే ఇండియా చైనా లాంటి దేశాల నుండి వలస వచ్చిన తల్లితండ్రులకు పుట్టి జన్మతః ఆ దేశ పౌరసత్వాన్ని పొందిన వారు . ఇక అట్టడుగు స్థాయిలో ఉన్న వారు వీసాపై వచ్చి చదువుకుంటున్న వారు, ఉద్యోగాలు చేస్తున్నవారు.

శ్వేత జాతి అమ్మాయి,  రెండో కేటగిరీకి చెందిన వారినో పెళ్లి చేసుకుంటుందా ? మామూలుగా అయితే జరగదు కానీ..  ఒక లెక్క ప్రకారం  జరిగే ఛాన్స్‌ ఉంది.

ఆఫ్రికా / ఇండియా మూలం కలిగిన వ్యక్తి బాగా డబ్బు సంపాదించాడు. తెల్ల అమ్మాయికి ఉద్యోగం లేదు. లేదా తక్కువ జీతం వచ్చే ఉద్యోగం . ఇప్పుడు  తాను, తన జాతి పరమైన ఉన్నత స్థానాన్ని ట్రేడింగ్ చేసుకొంటుంది . స్టార్ స్టేటస్ పొందిన నల్ల / బ్రౌన్ జాతి మూలాల్ని కలిగిన యువకుడ్ని పెళ్లి చేసుకొంటే .. వీడికి తెల్ల అమ్మాయి దొరికింది అనే తృప్తి. ఆమెకు కాష్ ఫ్లో .. రేపు పెళ్లి పెటాకులు అయితే .. కావాలని పెటాకులు చేసుకొన్నా..  సగం  జీతం .. ఆస్థి లో సగం . దెబ్బకు రెండు పిట్టలు .

జాతులు కలిసిపోయి కొత్త తరం మానవాళి రూపొందడం ఉత్తుత్తి మాటే .. అక్కడ సరి కొత్త జాతులు వెలుస్తున్నాయి. చర్మం రంగు .. గ్రీన్ కార్డు / పొరసత్వం , శాలరీ ప్యాకేజీ వీటి ఆధారంగా సరి కొత్త జాతులు వస్తున్నాయి. ఇక్కడ ఇంకో తిరకాసు. దక్షిణ భారతీయులు కొంత లిబరల్ అట.  ఉత్తర భారత  దేశ మూలాలు  కలిగిన వారైతే మహా ముదుర్లు అట . 

మనిషి ..మానవత్వం ..మట్టి..  మశానం..అన్ని ఉత్తుత్తి మాటలే .నువ్వు అమెరికన్ సిటిజానా ? లేక ఆకు పచ్చ కార్డు ? ఆకు పచ్చ కార్డు అయితే ఇక్కడ "ఎర్ర బస్సు ఎక్కి వచ్చిన జనాలు" అంటారే .. అలాగే ట్రీట్ చేస్తారట . దీనికి తోడు నీ శాలరీ ప్యాకేజీ ఏంటి ? బ్యాంకు బాలన్స్ ఎంత ?  ..

అక్కడితో అయిపోయిందా ?  చదివింది ఎక్కడ ? నువ్వు వీసా పైన ఉన్నా..  ఐఐటీ సరుకైతే కాస్త గౌరవం . అదే చైనా కోళ్లఫారాల సరుకంటే మాహా చిన్న చూపంట.ఇలాంటి వారికి ఏదో పేర్లు వున్నాయి. ఇక్కడి మీడియాకు ఎవరైనా చెప్పండయ్యా బాబు .. " మనోళ్లు " మనోళ్లు " అని రాస్తుంటే / చెబుతుంటే ఏదో ఫీలింగ్ వస్తోంది. చివరాకరికి మనోళ్లు కేటగిరీ అయితే .. జో బిడెన్ .. బరాక్ ఒబామా .. చైనా లో ఫుట్ పాత్ పై వస్తువులు అమ్ముకొనే చున్  వన్ ఉఛ్ .. మెక్సికో నుంచి వలస వచ్చి అమెరికా ఇళ్లల్లో పని చేసుకొనే ఇసాబెల్లా .. కెరిమెన్ .. అందరూ..  అందరూ..  అందరూ మనోళ్లే .

వారిది మనది హోమో సేపియన్స్ అనే ఒకటే జాతి .

కానీ మనోళ్లు అనే ఫీలింగ్ లేని వారిని.. కనీస  మానవ విలువలు లేని వారిని  ఎగేసుకొని మనోళ్లు మనోళ్లు అనడం పరమ అసహ్యంగా ఉంటుందా ? ఉండదా ? 

ఇంత ఆత్మ న్యూనత.. ఇంత ఐడెంటిటీ క్రైసిస్ ఏంటో ?


వాసిరెడ్డి అమర్ నాథ్, విద్యావేత్త, మానసిక పరిశోధకులు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top