
సాక్షి, సిటీబ్యూరో: దసరా, దీపావళి (Dasara - Diwali) వరుస పండుగలతో సందడి మొదలైంది. షాపింగ్, వాహనాల కొనుగోళ్లతో ఇల్లంతా హడావుడిగా తయారవుతోంది. పండగ సీజన్ ప్రారంభం కావడంతో ఇంటికి రంగుల్ని వేయించడం అందరికీ కుదరకపోవచ్చు. రంగులు వేయకున్నా ఇల్లు మెరవాలంటే శుభ్రం చేయడం కోసం కొంత సమయాన్ని వెచ్చించాలి. ఇందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. హడావుడి లేకుండానే ఓ పద్ధతి ప్రకారం ఇంటిని అలంకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఫ్లోరింగ్: మార్బుల్ ఫ్లోరింగ్ ఇంటికి అందనపు అందం, ఆకర్షణే. అయితే ఇదంతా తరచూ నిర్వహణ ఉన్నప్పుడే.. ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా నివారించాలి. దీని కోసం డోర్ మ్యాట్లు వాడకంతో సరిపెట్టకుండా ఇంటికి వచ్చే అతిథులు షూలను బయటేవిప్పి ఇంట్లోకి వచ్చేలా చూసుకోవాలి. ఫ్లోరింగ్ శుభ్రత కోసం రసాయనాల జోలికి వెళ్లకుండా నీటిలో కొంచెం అమ్మోనియా కలిపితే శుభ్రం చేశాక మీ ఫ్లోరింగ్ మెరిసిపోతుంది.
కార్పెట్లు: ఇవి దుమ్మును ఎక్కువగా ఆకర్షిస్తాయి. తరచూ వ్యాక్యుమ్ క్లీనర్‌తో శుభ్రం చేయాల్సిందే.. దుమ్ముతో కార్పెట్ కళావిహీనంగా కనిపించవచ్చు. కాబట్టి నాలుగున్నర లీటర్ల నీటిలో ఓ కప్పు తెల్ల వెనిగర్‌ను కలిపి బ్రష్‌తో రుద్దితే కార్పెట్‌లోని వర్ణాలు మెరుస్తాయి. కార్పెట్‌పై కొన్నిసార్లు టీ, సిరా వంటి మరకలు పడితే వాటిని పోగొట్టడానికి పావు కప్పు తేనె, సోడా, రెండు చెంచాల తెల్ల వెనిగర్‌తో చేసిన పేస్టు రుద్దాలి. ఫలితంగా ఆ మరకలు తొలిగిపోతాయి. పేస్టును ఆరనిచ్చి వ్యాక్యుమ్ క్లీనర్‌తో మరక ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయండి.
గోడలు: గోడలను తరచూ స్టాటిక్ డస్టర్‌తో తుడవాలి. బూజు, సాలెగూడు లాంటివి ఉంటే తొలగిపోతాయి. అనుకోకుండా గోడలపై పానీయాలు, టీ వంటివి పడితే వెంటనే నీళ్లు, గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్లతో శుభ్రం చేయాలి. గోడల్ని గట్టిగా రుద్దవద్దు.
వంటింట్లో: బాత్ ఫిట్టింగ్‌ల దగ్గర నుంచి ఫర్నిచర్ వరకు ఉక్కు ఎక్కువగా వాడుతుంటాం. స్టీల్‌కే పరిమితం కాకుండా పైన క్రోమ్‌పూతతో వస్తున్నాయి. స్నానాల గదిలో, వంటిట్లో వాడే నల్లాలు.. నీటిలోని ఉప్పు పేరుకుపోవడంతో చూడ్డానికి వికారంగా కనిపిస్తాయి. ఇలాంటి మరకల్ని తొలగించి స్టీల్ వస్తువులు మెరిసిపోవాలంటే ఆల్కాహాల్‌తో తుడవాలి. నల్లాపై మరకల్ని టూత్‌పేస్టుతో తుడిచి తొలగించవచ్చు.
ఇదీ చదవండి: మన రియల్‌ఎస్టేట్‌కు కలిసిరానున్న ట్రంప్ నిర్ణయం