క్యాడ్‌ కట్టడికి అస్త్రాలున్నాయ్‌ | Current account deficit falling rupee are biggest concerns of the Gulf crisis | Sakshi
Sakshi News home page

క్యాడ్‌ కట్టడికి అస్త్రాలున్నాయ్‌

May 22 2026 12:54 AM | Updated on May 22 2026 12:54 AM

Current account deficit falling rupee are biggest concerns of the Gulf crisis

సవాళ్లను ధైర్యంగా అధిగమిస్తాం 

మంత్రి పీయూష్‌ గోయల్‌ 

న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో విస్తరిస్తున్న కరెంటు ఖాతా లోటు (క్యాడ్‌)ను కట్టడి చేసేందుకు పలు చర్యలను పరిశీలిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ‘‘పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖలూ ఒక బృందంగా పనిచేస్తున్నాయి. పలు చర్యలను పరిశీలిస్తున్నాం. అంతర్జాతీయంగా నెలకొన్న సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో విజేతగా అవతరిస్తామన్న నమ్మకం, ధైర్యం, దృఢ విశ్వాసంతో ఉన్నాం’’అని మంత్రి పేర్కొన్నారు.

 కరెంట్‌ ఖాతా లోటు డిసెంబర్‌ త్రైమాసికంలో 13.2 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. జీడీపీలో ఇది 1.3 శాతానికి సమానం. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో క్యాడ్‌ 11.3 బిలియన్‌ డాలర్లుగానే ఉంది. కానీ, గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో ఏప్రిల్‌–డిసెంబర్‌ కాలంలో క్యాడ్‌ 30.1 బిలియన్‌ డాలర్లకు (జీడీపీలో ఒక శాతం) తగ్గడాన్ని గమనించొచ్చు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ఇది 36.6 బిలియన్‌ డాలర్లు (జీడీపీలో 1.3 శాతం)గా ఉంది. వస్తు, సేవల ఎగుమతులతో పోల్చితే దిగుమతులు, చెల్లింపుల విలువ పెరిగినప్పుడు ఏర్పడేదే కరెంటు ఖాతా లోటు.  

రూపాయి–దిగుమతుల ప్రభావం.. 
ముఖ్యంగా ఒకవైపు రూపాయి విలువ క్షీణిస్తుండడం.. మరోవైపు ముడి చమురు, బంగారం, వెండి దిగుమతుల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుండడంకరెంటు ఖాతా లోటు విస్తరణకు దారితీస్తోంది. 2025–26లో పసిడి దిగుమతుల విలువ 24 శాతం పెరిగి 71.98 బిలియన్‌ డాలర్లకు చేరింది. వెండి దిగుమతులు 150 శాతం పెరిగి 12 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలోనే బంగారం దిగుమతులు 81 శాతం పెరిగి 5.62 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 

ఫలితంగా ఏప్రిల్‌లో క్యాడ్‌ మూడు నెలల గరిష్ట స్థాయి అయిన 28.38 బిలియన్‌ డాలర్లకు పెరిగిపోవడం గమనార్హం. రూపాయి సైతం ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయి (డాలర్‌తో 96.80)కి పడిపోవడం చూస్తూనే ఉన్నాం. కరెన్సీ విలువ క్షీణత, ఏఐ తరహా భారీ వృద్ధి అవకాశాలున్న కంపెనీలు భారత్‌లో లేకపోవడం, ఈక్విటీల అధిక వ్యాల్యూషన్లతో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను క్రమంగా భారత్‌ నుంచి తరలించుకుపోతుండడం రూపాయి విలువను హరిస్తోంది. 

దీంతో పసిడి, వెండి దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వం ఇటీవలే దిగుమతి సుంకాలు పెంచడంతోపాటు పలు నియంత్రణలు విధించింది. ఆభరణాల కొనుగోళ్లు వాయిదా వేసుకోవాలని, విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, చమురు వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడం తెలిసిందే. ప్రధాని పట్ల విశ్వాసం ఉన్న వారి ఆచరణతో దేశానికి ఎంతో కొంత మేలు జరుగుతుందని మంత్రి గోయల్‌ అభిప్రాయపడ్డారు. గల్ఫ్‌ దేశాల సమాఖ్యతో (జీసీసీ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై మొదటి విడత చర్చలు 2026 ద్వితీయ ఆరు నెలల కాలంలో కార్యరూపం దాలుస్తాయని చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement