హైదరాబాద్‌ వినియోగదారుల ఫోరంలో ఎస్‌బీఐకి దెబ్బ

Consumer Forum Fine On Sbi While Home Loan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటి కొనుగోలుకు అవసరమైన రుణం మంజూరు చేయనందుకు బాధితుడికి రూ. 20 వేల ఖర్చును వడ్డీతో పాటు చెల్లించాలని, పరిహారం కింద మరో రూ. 50 వేలు చెల్లించాలని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా వినియోగ దారుల ఫోరం–3... 2018లో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ఎంఎస్‌కే జైస్వాల్‌ బుధవారం తాజా ఉత్తర్వులు ఇచ్చారు.

టీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగిగా పని చేస్తున్న గుడవల్లి భాస్కర్‌బాబు.. మలక్‌పేటలో ఓ ఫ్లాట్‌ కొనుగోలు చేసేందుకు రూ. 10 లక్షల రుణం కావాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా టీఎస్‌ఆర్‌టీసీ బ్రాంచ్‌లో 2017 జూన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగి కావడంతో అవసరమైన డాక్యుమెంట్లు, న్యాయ సలహా, ఫ్లాట్‌ విలువ వివరాలను నిపుణుల నుంచి తీసుకొని ఎస్‌బీఐకి సమర్పించారు. దరఖాస్తుదారుడి వివరాలను పరిశీలించిన ఎస్‌బీఐ కేవలం రూ. 4,35,000 మాత్రమే మంజూరు చేసింది. దీంతో భాస్కర్‌బాబు లక్ష రూపాయల పరిహారం, జరిగిన నష్టానికి రూ. 50,000 చెల్లించాలని జిల్లా వినియోగదారుల ఫోరం–3ని ఆశ్రయించారు. తాను రుణం కోసం అవసరమైన డాక్యుమెంట్లు, న్యాయ సలహా, వాల్యుయేషన్‌ సర్టిఫికేట్‌ తదితర వాటి కోసం చేసిన ఖర్చు వివరాలను పొందుపరిచారు. 

దీనిపై విచారించిన జిల్లా వినియోగదారుల ఫోరం–3 ఫిర్యాదుదారుడికి ఖర్చుల కింద రూ.40 వేలు, రుణం విషయంలో వేధింపులకు గాను రూ.50 వేలు, మరో 3వేలు ఇతర ఖర్చులకు ఇవ్వాలని 2018 డిసెంబర్‌ 12న ఆదేశించింది. దీనిపై ఎస్‌బీఐ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు ఫిర్యాదుదారుడు, ఎస్‌బీఐతో పాటు ఈ వివాదంతో సంబంధం ఉన్న వ్యక్తులను, సంస్థలను విచారించిన కమిషన్, భాస్కర్‌బాబుకు ఖర్చుల కింద రూ.20 వేలు, పరిహారంగా రూ.50 వేలు చెల్లించాలని బుధవారం ఆదేశించింది. రూ. 20 వేలకు జూన్‌ 2017 నుంచి ఇప్పటివరకు 6 శాతం వడ్డీ కూడా చెల్లించాలని పేర్కొంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top