రైలు టికెట్‌ బుకింగ్‌లోకి ఫ్లిప్‌కార్ట్‌ ‘క్లియర్‌ట్రిప్‌’ | Cleartrip enters train ticket booking via IRCTC partnership | Sakshi
Sakshi News home page

రైలు టికెట్‌ బుకింగ్‌లోకి ఫ్లిప్‌కార్ట్‌ ‘క్లియర్‌ట్రిప్‌’

Apr 30 2026 1:16 PM | Updated on Apr 30 2026 1:26 PM

Cleartrip enters train ticket booking via IRCTC partnership

ముంబై: ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ప్లాట్‌ఫారమ్‌ క్లియర్‌ట్రిప్‌ రైలు టికెట్‌ బుకింగ్‌ విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ)తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ట్రైన్‌ టికెటింగ్‌ సెగ్మెంట్‌లో సింగిల్‌ డిజిట్‌ మార్కెట్‌ వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందం ద్వారా దేశవ్యాప్తంగా అన్ని రూట్లలో ప్రయాణికులు రైలు టికెట్లు బుక్‌ చేసుకునే వీలు కల్పించింది.

రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు జనరల్, తత్కాల్‌ కోటాల్లో కూడా టికెట్లు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. అలాగే రియల్‌టైమ్‌ సీట్ల లభ్యత, చార్జీల వివరాలు, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌ ట్రాకింగ్, బెర్త్‌ ఎంపికలు, సురక్షిత డిజిటల్‌ చెల్లింపులు వంటి సేవలను ఒకే ప్లాట్‌ఫారమ్‌పై అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలో ప్రతి ఏటా 80 కోట్లకు పైగా రిజర్వేషన్‌ ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఇది భారీ మార్కెట్‌ అవకాశమే కాకుండా, వినియోగదారులకు భిన్నమైన సేవా అనుభవాన్ని అందించే అవకాశం కూడా ఉందని క్లియర్‌ట్రిప్‌ ఎయిర్‌ విభాగం చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ గౌరవ్‌ పట్వారీ తెలిపారు.

ఈ ఏడాది ముగిసేలోపు ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సర్వీసెస్‌ (ఓటీఎస్‌) విభాగంలో సింగిల్‌ డిజిట్‌ మార్కెట్‌ వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. రైలు ప్రయాణం భారత మొబిలిటీ ఎకోసిస్టమ్‌లో కీలక భాగమని, ఈ ప్రారంభం సమగ్ర బహుళ రవాణా సేవల వేదికగా ఎదగాలన్న సంస్థ లక్ష్యానికి కీలక అడుగని సంస్థ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ మంజరీ సింఘాల్‌ తెలిపారు. దీంతో సంస్థ వృద్ధి వేగవంతమవడంతో పాటు పోటీ సామర్థ్యం పెరుగుతుందన్నారు. మొత్తం వ్యాపారంలో రైలు టికెట్‌ బుకింగ్‌ వాటా 5 నుంచి 10 శాతానికి చేరుతుందని, రాబోయే కొన్నేళ్లలో ఈ విభాగంలో వేగవంతమైన వృద్ధి నమోదవుతుందని సింఘాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement