రవి అస్తమించినా సౌర కాంతులు! | Solar Power After Sunset, China Gobi Desert Solar Plant Defies Sunset Powers Through The Night, Watch Video Went Viral | Sakshi
Sakshi News home page

రవి అస్తమించినా సౌర కాంతులు!

Mar 25 2026 11:30 AM | Updated on Mar 25 2026 11:54 AM

China Gobi Desert Solar Plant Defies Sunset Powers Through the Night

సాధారణంగా సూర్యుడు అస్తమిస్తే సోలార్ ప్లాంట్ల పని ముగిసిపోతుంది. కానీ చైనాలోని గోబీ ఎడారిలో ఉన్న దున్‌హువాంగ్ సోలార్ ప్లాంట్‌ను చూస్తే అది నిజం కాదనిపిస్తుంది. నిప్పులు కురిపించే ఎడారి ఎండను ఒడిసిపట్టి రాత్రి వేళ కూడా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఈ ప్లాంట్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు 12,000 భారీ అద్దాలతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు పునరుత్పాదక ఇంధన రంగంలో ఒక సరికొత్త విప్లవమని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

ఏమిటీ ప్లాంట్ ప్రత్యేకత?

ఈ ప్లాంట్ మనం చూసే సాధారణ ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్లతో పనిచేసేది కాదు. దీన్ని ‘మొల్టెన్ సాల్ట్ కాన్సంట్రేటెడ్ సోలార్ పవర్’ (సీఎస్‌పీ) ప్లాంట్ అని పిలుస్తారు. దీని నిర్మాణం చూస్తే మధ్యలో ఒక భారీ టవర్, దాని చుట్టూ వేల సంఖ్యలో అద్దాలు అమర్చి ఉంటాయి. ఇక్కడ ఉన్న 12,000 అద్దాలు సూర్యుడు కదులుతున్న దిశకు అనుగుణంగా వాటికి అవే పొజిషన్‌ను సర్దుబాటు చేసుకుంటాయి. ఇవి సూర్యరశ్మిని పరావర్తనం చెందించి సరిగ్గా 260 మీటర్ల ఎత్తున్న సెంట్రల్ టవర్‌పైకి కేంద్రీకరిస్తాయి.

ఆ టవర్ పైభాగంలో ఉండే రిసీవర్‌లో ‘ద్రవ ఉప్పు’(మొల్టెన్ సాల్ట్) ఉంటుంది. అద్దాల నుంచి వచ్చే తీవ్రమైన వేడి వల్ల ఈ ఉప్పు సుమారు 565 డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది.

రాత్రి పూట విద్యుత్తు ఎలా సాధ్యం?

ఈ ప్లాంట్‌లోని అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. పగటిపూట వేడెక్కిన ఈ ద్రవ ఉప్పును భారీ ఇన్సులేటెడ్ ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. ఈ ఉప్పు తనలోని వేడిని చాలా కాలం పాటు కోల్పోదు. సూర్యుడు లేని సమయంలో లేదా రాత్రి వేళల్లో ఈ వేడి ఉప్పును ఉపయోగించి నీటిని ఆవిరిగా మారుస్తారు. ఆ ఆవిరి ద్వారా టర్బైన్లను తిప్పి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. తద్వారా 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా సాధ్యమవుతుంది. ఈ టవర్‌ ద్వారా ఏటా సుమారు 390 మిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఏటా సుమారు 3.5 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను దీని ద్వారా తగ్గిస్తున్నారు.

భవిష్యత్తుకు మార్గదర్శి

ప్రపంచం ప్రస్తుతం శిలాజ ఇంధనాల నుంచి స్వచ్ఛమైన ఇంధనం వైపు మళ్లుతోంది. బ్యాటరీ స్టోరేజ్ ఖరీదైన వ్యవహారంగా ఉన్న తరుణంలో ‘మొల్టెన్ సాల్ట్’ ద్వారా ఉష్ణాన్ని నిల్వ చేయడం అనేది అత్యంత చౌకైన, సమర్థవంతమైన మార్గం. దున్‌హువాంగ్ ప్రాజెక్టు కేవలం చైనాకే కాదు, ఎడారి ప్రాంతాలు ఎక్కువగా ఉన్న భారత్ వంటి దేశాలకు కూడా ఒక గొప్ప అవకాశం అని కొందరు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆట మళ్లీ షురూ.. ధరలు రివర్స్‌!

Advertisement
 
Advertisement
Advertisement