చైనా ‘వృద్ధి’ దూకుడు

China economy continues to growth back from virus slump - Sakshi

సెప్టెంబర్‌ త్రైమాసికంలోనూ ఎకానమీ 4.9% వృద్ధి

బీజింగ్‌: ప్రధాన ఆర్థిక వ్యవస్థలుసహా ప్రపంచంలోని పలు దేశాల ఎకానమీలు కరోనా ప్రేరిత అంశాలతో క్షీణతలోకి జారుతున్న నేపథ్యంలో... ఈ మహమ్మారికి పుట్టినిల్లు చైనా మాత్రం వృద్ధి బాటన సాగుతోంది. ఈ ఏడాది వరుసగా రెండవ త్రైమాసికం జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఆ దేశ ఎకానమీ 4.9 శాతం వృద్ధి రేటును (2019 ఇదే కాలంతో పోల్చి) నమోదుచేసుకుంది. నిజానికి సెప్టెంబర్‌ త్రైమాసికంలో చైనా ఆర్థిక వ్యవస్థ 5.2 శాతం వృద్ధి సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే దీనికన్నా 30 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తక్కువ వృద్ధి నమోదయ్యింది.  కరోనా సవాళ్లతో మొదటి త్రైమాసికం జనవరి–మార్చి మధ్య 44 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 6.8 శాతం క్షీణతకు జారిపోయిన చైనా ఆర్థిక వ్యవస్థ, మరుసటి క్వార్టర్‌ (ఏప్రిల్‌–జూన్‌)లోనే 3.2 శాతం వృద్ధి నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. డిమాండ్, వినియోగానికి ఊతం ఇవ్వడానికి చైనా ప్రభుత్వం ఇచ్చిన ఉద్దీపనలు దేశం వృద్ధి బాటన నడవడానికి కారణమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. చైనా జాతీయ గణాంకాల విభాగం (ఎన్‌బీఎస్‌) సోమవారం తాజా గణాంకాలను విడుదల చేసింది.  

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top