breaking news
growth in business
-
కొత్త ఏడాదిలో రయ్రయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత వాహన పరిశ్రమ 2021–22లో బలమైన వృద్ధి నమోదు చేయనుందని నోమురా రిసర్చ్ ఇన్స్టిట్యూట్ కన్సల్టింగ్, సొల్యూషన్స్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. కోవిడ్–19 కారణంగా ఎదుర్కొన్న తీవ్ర ప్రభావం నుంచి ఈ రంగం కోలుకుంటుందని.. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు తోడవడంతో పరిశ్రమ సానుకూలంగా ఉంటుందని వివరించింది. అయితే వ్యక్తిగత వాహనాల అమ్మకాలు 2018–19 స్థాయికి చేరుకునేది 2022–23లోనే అని స్పష్టం చేసింది. అలాగే ద్విచక్ర వాహనాలకు మరో ఏడాది (2023–24) పట్టొచ్చని నోమురా ప్రతినిధి ఆశిమ్ శర్మ తెలిపారు. కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడంతో కొంత ధరల పెరుగుదలకు అవకాశం ఉండడమూ ఇందుకు కారణమని అన్నారు. సియామ్ లెక్కల ప్రకారం.. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రకారం.. 2019–20లో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 17.88 శాతం తగ్గి 27,73,575 యూనిట్లుగా ఉంది. ద్విచక్ర వాహనాలు 17.76 శాతం తగ్గి 1,74,17,616 యూనిట్లు నమోదైంది. 2018–19లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు అంత క్రితం ఏడాదితో పోలిస్తే 2.7 శాతం వృద్ధి చెంది 33,77,389 యూనిట్ల స్థాయికి చేరాయి. 2017–18లో ఇది 32,88,581 యూనిట్లుగా ఉంది. 2018–19లో ద్విచక్ర వాహనాల విక్రయాలు 4.86 శాతం అధికమై 2,11,81,390 యూనిట్లకు చేరుకున్నాయి. అంత క్రితం ఏడాది ఇది 2,02,00,117 యూనిట్లు నమోదైంది. కొత్త కంపెనీల రాకతో..: వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ మెరుగ్గా ఉంటాయని నోమురా వెల్లడించింది. ప్రధానంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఉంటుందని తెలిపింది. కొత్త కంపెనీల రాకతో ఈ విభాగం సానుకూలంగా ఉంటుందని వివరించింది. ఈవీ విడిభాగాల విషయానికి వస్తే.. సాంకేతిక భాగస్వామ్యంతో సెల్ స్థాయి తయారీ భారత్లో ప్రారంభం అయింది. లిథియం టైటానియం ఆక్సైడ్ (ఎల్టీవో) బ్యాటరీల వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంపై కంపెనీలు దృష్టిసారించాయి. ఎల్టీవో బ్యాటరీలతో త్వరితగతిన చార్జింగ్ పూర్తి అవుతుంది. 10 వేల సార్లకుపైగా చార్జీ చేయవచ్చు. ఎగుమతి అవకాశాలు.. మోటార్స్, కంట్రోలర్స్ సైతం భారత్లో తయారవుతున్నాయి. స్థానిక ఉత్పత్తిదార్లతోపాటు.. ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు ఆదరణ పెరుగుతుండడంతో విడిభాగాల తయారీలోకి కొత్తవారు ప్రవేశిస్తున్నారు. విడిభాగాలు, బ్యాటరీల తయారీలో ఉన్న దేశీయ వాహన కంపెనీలకు ఎగుమతి అవకాశాలూ పెరగనున్నాయి. వీటి నిరంతర సరఫరా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ప్రత్యామ్నాయ వనరులను కనుగొనే పనిలో ఉన్నాయని నివేదిక గుర్తు చేసింది. -
చైనా ‘వృద్ధి’ దూకుడు
బీజింగ్: ప్రధాన ఆర్థిక వ్యవస్థలుసహా ప్రపంచంలోని పలు దేశాల ఎకానమీలు కరోనా ప్రేరిత అంశాలతో క్షీణతలోకి జారుతున్న నేపథ్యంలో... ఈ మహమ్మారికి పుట్టినిల్లు చైనా మాత్రం వృద్ధి బాటన సాగుతోంది. ఈ ఏడాది వరుసగా రెండవ త్రైమాసికం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఆ దేశ ఎకానమీ 4.9 శాతం వృద్ధి రేటును (2019 ఇదే కాలంతో పోల్చి) నమోదుచేసుకుంది. నిజానికి సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా ఆర్థిక వ్యవస్థ 5.2 శాతం వృద్ధి సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే దీనికన్నా 30 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తక్కువ వృద్ధి నమోదయ్యింది. కరోనా సవాళ్లతో మొదటి త్రైమాసికం జనవరి–మార్చి మధ్య 44 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 6.8 శాతం క్షీణతకు జారిపోయిన చైనా ఆర్థిక వ్యవస్థ, మరుసటి క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లోనే 3.2 శాతం వృద్ధి నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. డిమాండ్, వినియోగానికి ఊతం ఇవ్వడానికి చైనా ప్రభుత్వం ఇచ్చిన ఉద్దీపనలు దేశం వృద్ధి బాటన నడవడానికి కారణమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. చైనా జాతీయ గణాంకాల విభాగం (ఎన్బీఎస్) సోమవారం తాజా గణాంకాలను విడుదల చేసింది.