
న్యూఢిల్లీ: ప్రయాణ సర్వీసులందించే చార్టర్డ్ స్పీడ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 655 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు పంకజ్ గాంధీ, అల్కా పంకజ్ గాంధీ విక్రయానికి ఉంచనున్నారు.
ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 396 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 97 కోట్లు ఎలక్ట్రిక్ బస్‌ల కొనుగోలుకీ వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. 2007లో ఏర్పాటైన అహ్మదాబాద్ కంపెనీ ప్రధానంగా ప్యాసింజర్ మొబిలిటీ సర్వీసులను అందిస్తోంది.
2025 జూన్30కల్లా 500 పట్టణాలలో 2,000 బస్సులతో సర్వీసులు సమకూర్చుతోంది. గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో రూ. 667 కోట్ల ఆదాయం, రూ. 70 కోట్ల నికర లాభం ఆర్జించింది. అనుబంధ సంస్థల ద్వారా 945 ఎలక్ట్రిక్ బస్‌ల కొనుగోలుకి ఆర్డర్లు జారీ చేసింది.