ఒకప్పుడు మాదాపూర్‌.. ఇప్పుడంతా నల్లగండ్ల వైపే

Buyers preferences in real estate Sector - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం కరోనా మహమ్మారి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. ప్రస్తుతానికైతే కుదుటపడ్డట్టే కనిపిస్తుంది. కేసుల సంఖ్య తగ్గిపోవటం, వేగవంతమైన వ్యాక్సినేషన్‌తో ప్రజలలో నమ్మకం పెరిగింది. దీంతో గృహ కొనుగోలుదారులు మార్కెట్లోకి తిరిగి వస్తున్నారు. ఇతర నగరాలతో పోలిస్తే ధరలు స్థిరంగానే ఉండటంతో సమీప భవిష్యత్తులో డిమాండ్‌ ఏర్పడటం ఖాయమని వెర్టెక్స్‌ ఎండీ వీవీఆర్‌ వర్మ అభిప్రాయపడ్డారు. కోవిడ్‌ సమయంలోనూ హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు స్థిరమైన వృద్ధిని నమోదు చేశాయి. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతుందనే అంచనాల నేపథ్యంలో భవిష్యత్తులో నివాస విభాగానికి గణనీయమైన డిమాండ్‌ ఉంటుందని తెలిపారు. 

మారిన అభిరుచులు
కరోనా తర్వాతి నుంచి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. విలాస, విశాలమైన అపార్ట్‌మెంట్లు, విల్లాలను కొనుగోలు చేస్తున్నారు.  విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లతో పాటూ కొన్ని కంపెనీలు ఇప్పటికీ వర్క్‌ ఫ్రం హోమ్‌ను కొనసాగిస్తుండటం, మరికొన్ని కంపెనీలు హైబ్రిడ్‌ విధానంలో ఉండటంతో గృహ కొనుగోలుదారులు హోమ్‌ ఆఫీస్‌ వసతులు ఉన్న ప్రాజెక్ట్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పాటూ సూపర్‌ స్టోర్, ఫార్మసీ, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు గేటెడ్‌ కమ్యూనిటీ లోపలే ఉన్న ప్రాజెక్ట్‌లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 

భిన్న ప్రాధాన్యతలు
గృహ ఎంపికలో కొనుగోలుదారుల ప్రాధాన్యతలు విభిన్నంగా ఉన్నాయి. కొంత మంది ఇంటికి చేరువలోనే ఆఫీసు, స్కూల్, ఆసుపత్రులు, మార్కెట్‌ వంటివి ఉండాలని కోరుకుంటుంటే... మరికొంత మంది రద్దీ జీవనానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో గృహాలు ఉండాలని భావిస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాలు విద్యా సంస్థలు, పని ప్రదేశాలతో అనుసంధానించబడి ఉండాలని కోరుకుంటున్నారు. మధ్య తరహా గృహాలతో పాటూ అల్ట్రా ప్రీమియం ప్రాజెక్ట్‌లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. 

నల్లగండ్ల, తెల్లాపూర్‌..
హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వంటి పశ్చిమ హైదరాబాద్‌ ప్రాంతాలలోని ప్రాజెక్ట్‌లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. మాదాపూర్‌ వంటి ఏరియాలో పరిమిత స్థాయిలో స్థలాల లభ్యత కారణంగా కోకాపేట, నల్లగండ్ల, తెల్లాపూర్, కొల్లూరు వంటి ప్రాంతాలు ఇప్పుడు వెస్ట్‌ హైదరాబాద్‌లో సరికొత్త నివాస కేంద్రాలుగా అవతరించాయి. కొంపల్లి, ఈసీఐఎల్‌ వంటి ఏరియాలు కూడా నివాస సముదాయ కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top