లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులకు సై అంటోన్న ఆ సంస్థ

BPCL Planning To Invest One Lakh Crore Rupees - Sakshi

ఉత్పత్తి పెంపు, గ్యాస్‌ బిజినెస్, శుద్ధ ఇంధనాలపై దృష్టి 

భవిష్యత్‌ ప్రణాళికలు వెల్లడించిన బీపీసీఎల్‌ చైర్మన్‌ కుమార్‌  

న్యూఢిల్లీ: ప్రయివేటైజేషన్‌ ప్రక్రియలో ఉన్న పీఎస్‌యూ దిగ్గజం భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) రానున్న ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు వెల్లడించింది. పెట్రోకెమికల్‌ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడం, గ్యాస్‌ బిజినెస్, శుద్ధ ఇంధనం, మార్కెటింగ్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితరాలకు నిధులను వెచ్చించనున్నట్లు కంపెనీ చైర్మన్‌ అరుణ్‌ కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు. తద్వారా భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్లుగా కంపెనీని తీర్చిదిద్దనున్నట్లు తెలియజేశారు. సంప్రదాయ ఇంధనాలతోపాటు.. కర్బనరహిత మొబిలిటీకి వీలయ్యే ఎలక్ట్రిక్‌ వాహనాలు, హైడ్రోజన్‌లపై దృష్టిపెట్టనున్నట్లు వివరించారు. ముడిచమురు నుంచి అధిక విలువగల పెట్రోకెమికల్స్‌ను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.  


కార్యాచరణ ఇలా 
దేశంలోనే రెండో పెద్ద ఇంధన రిటైలింగ్‌ కంపెనీ బీపీసీఎల్‌ 1,000 మెగావాట్ల పోర్ట్‌ఫోలియోతో పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు అరుణ్‌ కుమార్‌ విలేకరులకు వెల్లడించారు. ఇంకా ఏమన్నారంటే.. ప్రధానంగా ఇతర కంపెనీల కొనుగోలు ద్వారా బీపీసీఎల్‌ పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోనుంది. బయోఇంధనాలు, హైడ్రోజన్‌పై ఇన్వెస్ట్‌ చేయనుంది. మధ్య, దీర్ఘకాలాలలో 19,000 పెట్రోల్‌ పంపుల్లో 7,000ను ఎనర్జీ స్టేషన్లుగా మార్పు చేయనుంది. పెట్రోల్, డీజిల్‌తోపాటు.. ఈవీ చార్జింగ్, సీఎన్‌జీ, హైడ్రోజన్‌ తదితరాలను అందించనుంది.    
చదవండి : crude oil: ఆగస్టులో తగ్గిన క్రూడ్‌ ఉత్పత్తి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top