వర్షం పడితే చాలు దోపిడీ | Bengaluru Rains Trigger 1200 Auto Fare for 15 Km Outrage Floods Social Media | Sakshi
Sakshi News home page

వర్షం పడితే చాలు దోపిడీ

May 6 2026 1:36 PM | Updated on May 6 2026 2:26 PM

Bengaluru Rains Trigger 1200 Auto Fare for 15 Km Outrage Floods Social Media

దేశ ఐటీ రాజధానిగా, ఆధునిక సాంకేతికతకు కేంద్రంగా పేరుగాంచిన బెంగళూరులో వర్షం కురిస్తే చాలు జనజీవనం స్తంభించడంతోపాటు రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. తాజాగా కేవలం 15 కిలోమీటర్ల ప్రయాణానికి ఛార్జీ కింద ఏకంగా రూ.1,200 వసూలు చేశారనే ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న ఈ సర్జ్ ప్రైసింగ్ (అధిక ఛార్జీలు) వ్యవహారంపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగింది?

ప్రముఖ కంటెంట్ క్రియేటర్ సాన్యా సింగ్ తన స్నేహితురాలికి ఎదురైన చేదు అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. భారీ వర్షాలు, ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయంలో కేవలం 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆటో డ్రైవర్ రూ.1,200 డిమాండ్ చేశాడని ఆమె పేర్కొన్నారు. ఇంటికి సురక్షితంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఆమె అంత మొత్తం చెల్లించాల్సి వచ్చిందని వెల్లడించారు. అంతేకాకుండా ట్రాఫిక్ కారణంగా ఇంటికి చేరుకోవడానికి ఆమెకు ఏకంగా 3 గంటల సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గందరగోళం

బెంగళూరు వర్షాల గురించి సాన్యా సింగ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ‘బెంగళూరులో వర్షం కురిసినప్పుడు వయోలిన్ సంగీతం వినిపించదు. కేవలం హారన్ల మోత మాత్రమే వినిపిస్తుంది. కాలేజీలో అడ్మిషన్ పొందడం కంటే వర్షం సమయంలో ఆటో బుక్ చేయడం చాలా కష్టమైన పని. మా కెరీర్లు ఎలా ఉన్నా ఆటో డ్రైవర్లు మాత్రం ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ భారీగా సంపాదిస్తున్నారు’ అని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియాలో..

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ‘వర్షం పడితే చాలు ఆటోలు, క్యాబ్‌ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి’ అని ఒక వినియోగదారుడు పేర్కొన్నారు. ‘డిమాండ్, సరఫరా పేరుతో డ్రైవర్లు ఇష్టానుసారంగా ధరలను పెంచేస్తున్నారు. దీనిని నియంత్రించే వ్యవస్థ లేదా నియమ నిబంధనలు ఎక్కడ ఉన్నాయి?’ అని మరొకరు ప్రశ్నించారు.

ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement