భారతదేశపు అత్యంత పురాతన వ్యాపార సంస్థలలో ఒకటిగా, 148 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో అతిపెద్ద గ్రూపులలో ఒకటిగా ఉన్న బజాజ్ గ్రూప్, నేడు 100 ఏళ్ల వ్యాపార ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. భారత స్వాతంత్య్ర ఉద్యమం నుంచి నేటి ఆర్థికాభివృద్ధి వరకు దేశ గమనంతో ముడిపడి ఉన్న ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త, పరోపకారి, పారిశ్రామికవేత్త అయిన జమ్నాలాల్ బజాజ్ 1926లో ముంబైలో ఈ గ్రూప్‌ను స్థాపించారు. మహాత్మా గాంధీ ఐదవ దత్తపుత్రుడిగా పేరుగాంచిన ఆయన వేసిన పునాదులతో, నేడు బజాజ్ గ్రూప్ దేశంలోని ప్రతి మూడు కుటుంబాలలో ఒకరికి సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 1,30,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
100 కంటే ఎక్కువ కంపెనీలు, 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతులు.. త్వరలో ఆరోగ్య సంరక్షణ (healthcare) రంగంలోకి అడుగుపెట్టబోతున్న బజాజ్ గ్రూప్, ఆటోమొబైల్స్, ఆర్థిక సేవలు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇంజినీరింగ్ రంగాలలో భారత అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ముకంద్ వంటివి ఈ గ్రూపులోని కొన్ని లిస్టెడ్ కంపెనీలు.
దేశ నిర్మాణంలో బజాజ్ గ్రూప్ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ, బజాజ్ కుటుంబానికి పంపిన సందేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు, "బజాజ్ గ్రూప్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, ఈ మైలురాయితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ నేను నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏ సంస్థకైనా వందేళ్ల ప్రయాణం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది కేవలం ఆ సంస్థ దీర్ఘకాలిక ఉనికిని మాత్రమే కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతూ, తరతరాల పాటు తన ప్రాముఖ్యతను కాపాడుకునే సామర్థ్యాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.
జమ్నాలాల్ బజాజ్ నాయకత్వంలో ప్రారంభమైన బజాజ్ గ్రూప్, మన దేశ అభివృద్ధిలోని అనేక దశలలో భారతదేశ పారిశ్రామిక మరియు ఆర్థిక రంగంలో ఒక భాగంగా ఉంది. ఇది వివిధ రంగాలలో కార్యకలాపాలు సాగిస్తూ.. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సేవలు అందించే ఒక వైవిధ్యభరితమైన కంపెనీగా ఎదిగింది.
గడిచిన దశాబ్దాలుగా ఉద్యోగ అవకాశాలను కల్పించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు సామాజిక అభివృద్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా దేశ నిర్మాణంలో బజాజ్ గ్రూప్ ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇలాంటి మైలురాళ్లు గతంలో అందించిన కీలక సహకారాలను గుర్తు చేసుకోవడానికి, అలాగే వృద్ధి, సుస్థిరత, అందరినీ కలుపుకునిపోయే పురోగతి పట్ల నిబద్ధతను పునరుద్ధరించుకోవడానికి ఒక గొప్ప అవకాశం.
తయారీ రంగం, ఆవిష్కరణలు, ప్రపంచ స్థాయి పోటీతత్వంలో భారత్ నూతన ఆకాంక్షలతో ముందుకు సాగుతోంది. బజాజ్ గ్రూప్ వంటి లోతైన మూలాలు, అనుభవం ఉన్న సంస్థలు 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించాల్సి ఉంది.
ఈ చిరస్మరణీయ సందర్భంలో బజాజ్ గ్రూప్‌లోని ప్రతి ఒక్కరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రాబోయే కాలంలో కూడా దేశాభివృద్ధిలో ఈ సంస్థ నిరంతర పురోగతిని మరియు అర్థవంతమైన సహకారాన్ని అందిస్తుందని నేను విశ్వసిస్తున్నాను" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన, శిశు ఆరోగ్యం, విద్య, రక్షణపై దృష్టి సారించిన బజాజ్ గ్రూప్ సామాజిక సేవా కార్యక్రమాలు (CSR), ఇప్పటివరకు 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది లబ్ధిదారుల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపాయి.
ముంబైలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఈ శతాబ్ది వేడుకల్లో బజాజ్ కుటుంబ సభ్యులు, పారిశ్రామిక దిగ్గజాలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, వ్యాపార భాగస్వాములు పాల్గొన్నారు. ఈ సాయంత్రం వేళ భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆ కుటుంబం పోషించిన పాత్ర నుంచి, వర్తక వ్యాపారం నుంచి తయారీ.. ఆర్థిక సేవల రంగం వైపు సాగిన మార్పు వరకు, అలాగే నేడు వారి వ్యాపారాలు ముందుండి నడిపిస్తున్న సరికొత్త సాంకేతికత వరకు సాగిన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రదర్శించారు.
ఈ కార్యక్రమం ముఖ్యాంశాలలో బజాజ్ కుటుంబ సభ్యుల ప్రసంగాలు, గ్రామీ అవార్డు గ్రహీత మరియు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపోజర్ రికీ కేజ్(Ricky Kej) మరియు ఆయన బృందం ప్రత్యేకంగా రూపొందించిన లైవ్ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు జమ్నాలాల్ బజాజ్ మరియు మహాత్మా గాంధీపై రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ‘కథ్నీ కర్నీ ఏక్సీ’ (Kathni Karni Eksi) అనే చిత్రాన్ని ప్రదర్శించారు. ‘100 ఇయర్స్ ఆఫ్ బజాజ్’ లోగోను ఆవిష్కరించారు.


