ఫోన్‌కాల్‌లో బండబూతులు.. భారత్‌పే ఎండీకి ఉద్వాసన?.బోర్డు రియాక్షన్‌ ఇది

Ashneer Grover Under Leave Not Fire Says BharatPe Board - Sakshi

ఫిన్‌టెక్‌ కంపెనీ భారత్‌పే ఎండీ, సహ వ్యవస్థాపకుడు అష్నీర్‌ గ్రోవర్‌కు ఉద్వాసన దిశగా కంపెనీ నిర్ణయం తీసుకోనుందా? తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నప్పటికీ.. తెర వెనుక వ్యవహారం మరోలా ఉందని తెలుస్తోంది. 

కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఉద్యోగిని ఫోన్‌కాల్‌లో దుర్భాషలాడుతూ.. అష్నీర్‌ గ్రోవర్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక క్లిప్‌ వైరల్‌ అయిన విషయం తెలిసిందే.  ఈ వ్యవహారంలో న్యాయపరమైన చర్యలకు దిగిన కొటాక్‌ మహీంద్రా, భారత్‌పే ఎండీకి నోటీసులు సైతం పంపింది. దీంతో కంపెనీ అష్నీర్‌ను హడావిడిగా సెలవుల మీద బయటికి పంపింది. తాజాగా మార్చి చివరినాటి వరకు ఆయన సెలవుల్ని పొడిగిస్తున్నట్లు భారత్‌పే ఒక ప్రకటనలో పేర్కొంది.

శాశ్వతంగా..?
‘ఇది పూర్తిగా అష్నీర్‌ తీసుకున్న నిర్ణయం.. కంపెనీ, ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా అష్నీర్‌ నిర్ణయంతో మేం ఏకీభవిస్తున్నాం’ అని ప్రకటనలో పేర్కొంది కంపెనీ. అయితే అష్నీర్‌ లాంగ్‌ లీవ్‌ వెనుక బోర్డు ఒత్తిడి ఉన్నట్లు ఓ ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం అష్నీర్‌ స్థానంలో సీఈవో సుహాయిల్‌ సమీర్‌ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శక్తివంతమైన మేనేజ్‌మెంట్‌ టీంతో ముందుకు వెళ్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేయడం ఆసక్తిని రేకెత్తించింది. మరోవైపు సెలవుల పరిణామంపై స్పందించేందుకు అష్నీర్‌ విముఖత వ్యక్తం చేయడంతో.. భారత్‌పే ఎండీ ఉద్వాసన దాదాపు ఖరారైనట్లేనని జోరుగా ప్రచారం సాగుతోంది. 

అలాంటిదేం లేదు!
3 బిలియన్‌ డాలర్ల విలువ ఉన్న భారత్‌పేలో ఇలాంటి విషపూరిత సంప్రదాయం మంచిది కాదనే ఉద్దేశానికి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ వచ్చినట్లు సమాచారం. బోర్డు సభ్యులతో పాటు ఇన్వెస్టర్లుగా సెకోయియా ఇండియా, రిబ్బిట్‌ క్యాపిటల్‌, కోవాట్యు మేనేజ్‌మెంట్‌తో పాటు పలువురు బ్యాంకింగ్‌ దిగ్గజాలు ఉన్నారు.  వీళ్లంతా ప్రతిపాదించినందునే.. అష్నీర్‌ లాంగ్‌ లీవ్‌ మీద వెళ్లాడే తప్ప.. ఉద్వాసన లాంటి పరిణామం ఏం లేదని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపినట్లు ఓ ప్రముఖ మీడియాహౌజ్‌ కథనం ప్రచురించింది. ‘బోర్డుకు ఆయన్ని తొలగించే ఉద్దేశం లేదు. కానీ, మీడియా ఊహాగానాల్ని దూరం చేయాలన్న ఉద్దేశంతో మాత్రం ఉంది. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత వ్యవహారం. ప్రొఫెషనల్‌కి సంబంధించింది కాదు’.. అంటూ బోర్డులోని ఓ కీలక సభ్యుడు వెల్లడించాడు. 

నైకా ఐపీవో సంబంధిత షేర్ల కేటాయింపులో కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ విఫలమైందని అష్నీర్‌ గ్రోవర్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆపై 500 కోట్ల రూపాయలకు కొటక్‌ మహీంద్రా మీద దావా వేశారు. అంతటితో ఆగకుండా అష్నీర్‌, ఆయన భార్య మాధురి.. కాల్‌లో బ్యాంక్‌ ప్రతినిధిని అసభ్యంగా దూషించడంతో.. కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ లీగల్‌ నోటీసులు పంపింది.

సంబంధిత వార్త: 500 కోట్ల పరిహారం.. ఆపై భార్యతో ఫోన్‌లో బండబూతులు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top