500 కోట్ల పరిహారం అడిగాడు.. ఆపై భార్యతో కలిసి ఫోన్‌లో బండబూతులు తిట్టాడు!

Kotak Bank Legal action Against BharatPe Founder Over Abusive Call - Sakshi

కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఫిన్‌టెక్‌ కంపెనీ ‘భారత్‌పే’ ఎండీ అష్నీర్‌ గ్రోవర్‌ మధ్య వివాదం మరింత ముదురుతోంది. నైకా ఐపీవో సంబంధిత షేర్ల కేటాయింపులో కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ విఫలమైందని అష్నీర్‌ గ్రోవర్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వివాదం మరో మలుపు తిరిగింది.

కొటక్‌ బ్యాంక్‌ నుంచి నష్టపరిహారం కోరుతూ 500 కోట్ల రూపాయలకు దావా కూడా వేశాడు అష్నీర్ గ్రోవర్. అయితే తాజాగా ఈ పరిణామంలో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. అష్నీర్‌, ఆయన భార్య మాధురి ఫోన్‌కాల్‌లో తమ ప్రతినిధిని అసభ్యంగా దూషించారని ఆరోపిస్తూ న్యాయపరమైన చర్యలకు సిద్ధమైంది కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌. ఈ మేరకు ఆదివారం ఆ జంటకు నోటీసులు సైతం పంపింది. 

అష్నీర్‌ గ్రోవర్‌-కొటక్‌ బ్యాంక్‌ మధ్య వివాదం మరింత ముదురుతోంది. అష్నీర్‌ జంట నుంచి అక్టోబర్‌ 30న లీగల్‌ నోటీసులు అందుకున్నట్లు ఒప్పుకున్న కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌.. అది ఎందుకనో స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే టైంకి మాత్రం బదులు ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే గ్రోవర్‌ ఆడియో కాల్‌లో తమ ప్రతినిధిని ఉద్దేశించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై మాత్రం న్యాయపరమైన చర్యలకు వెళ్తున్నట్లు కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ హెడ్‌ క్వార్టర్‌ ఒక మీడియా స్టేట్‌మెంట్‌లో వెల్లడించింది. 

నా గొంతు కాదు
ఇదిలా ఉంటే సోషల్‌ మీడియాలో గతవారం ఒక ఆడియో క్లిప్‌ విపరీతంగా వైరల్‌ అయ్యింది. ఒక బ్యాంక్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌తో దురుసుగా ఒక జంట మాట్లాడిన క్లిప్‌ అది. ఆ కాల్‌లో ఒక వ్యక్తి అసభ్య పదజాలం ఉపయోగిస్తుండగా.. అవతలి వ్యక్తి అతన్ని శాంతింపజేసే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఆ క్లిప్‌లో గొంతు భారత్‌పే ఎండీ అష్నీర్‌ గ్రోవర్‌దే అంటూ కథనాలు వెలువడ్డాయి. కానీ, అష్నీర్‌ అది తన గొంతు కాదని ఖండించాడు కూడా. మరోవైపు లీగల్‌ నోటీసులు స్పందించేందుకు భారత్‌పే నిరాకరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top