'యాప్‌లు మాయం.. ఏఐ చేతికి జీవితం': నథింగ్ సీఈఓ | Apps Are Dying AI Is Taking Over Smartphones Says Nothing CEO | Sakshi
Sakshi News home page

'యాప్‌లు మాయం.. ఏఐ చేతికి జీవితం': నథింగ్ సీఈఓ

Apr 10 2026 5:01 PM | Updated on Apr 10 2026 5:10 PM

Apps Are Dying AI Is Taking Over Smartphones Says Nothing CEO

టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతూ.. దాదాపు అన్ని రంగాల్లోనూ ఎప్పటికప్పుడు కొత్త మార్పులు తీసుకొస్తోంది. 2007లో యాపిల్ కంపెనీ ఐఫోన్ లాంచ్ చేసినప్పుడు.. ఫోన్ పరిశ్రమలో ఒక మహత్తర మార్పు చోటుచేసుకుంది. అప్పటివరకు మనం ఉపయోగించిన కీప్యాడ్ ఫోన్లు నెమ్మదిగా అంతరించిపోయి, టచ్‌స్క్రీన్ ఫోన్లు వచ్చేశాయి. ఇప్పడూ స్మార్ట్‌ఫోన్‌లను మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాయి.

నథింగ్ సీఈఓ 'కార్ల్ పీ' అభిప్రాయం ప్రకారం.. గత ఇరవై సంవత్సరాలుగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగంలో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. మనం ఇంకా లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్, యాప్‌లు, యాప్ స్టోర్‌లకు పరిమితమై ఉన్నాం. ఏ చిన్న పని చేయాలన్నా మనం అనేక యాప్‌లను ఉపయోగిస్తూ.. సమయం వృధా చేస్తున్నాం. ఇది కొంత క్లిష్టంగా మారింది.

ప్రస్తుతం ఏఐ ఒక కొత్త విప్లవానికి దారితీయనుంది. భవిష్యత్తులో యాప్‌లు పూర్తిగా మాయమైపోయి.. వాటి స్థానంలో ఏఐ ఏజెంట్స్ రానున్నాయి. అలవాట్లు, ఇష్టాలు, అవసరాలను అర్థం చేసుకుని మన తరఫున పనులను స్వయంగా నిర్వహిస్తాయి. ఉదాహరణకు, ఒక స్నేహితుడితో కాఫీకి వెళ్లాలని అనుకుంటే, మనం వేర్వేరు యాప్‌లను ఉపయోగించకుండా, ఏఐ మన కోసం సమయం నిర్ణయించి, స్థలం ఎంపిక చేస్తుందన్నమాట.

ప్రస్తుతం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఇచ్చే ఆదేశాలపై ఆధారపడి పనిచేస్తుంది. కానీ భవిష్యత్తులో రానున్న ఏఐ మన ఆలోచనలను కూడా ముందుగానే అర్థం చేసుకుని సూచనలు ఇవ్వగలదు. ఇది మన జీవితాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా, టెక్నాలజీపై మన ఆధారాన్ని కూడా పెంచుతుంది.

ఈ మార్పు స్టార్టప్ కంపెనీలకు ఒక సవాలుగా మారవచ్చు. ఇప్పటివరకు యాప్‌లపై ఆధారపడిన వ్యాపార నమూనాలు భవిష్యత్తులో పనిచేయకపోవచ్చు. అందువల్ల.. కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకుని, ఏఐ ఆధారిత పరిష్కారాలపై దృష్టి పెట్టాలి. లేకుంటే.. వారు ఇతర సంస్థలతో వెనుకబడే అవకాశం ఉంది.

ఇప్పటికే కొన్ని కంపెనీలు ఏఐను తమ ఉత్పత్తుల్లో అమలు చేయడం ప్రారంభించాయి. నథింగ్ వంటి సంస్థలు వినియోగదారులకు ఏఐ ఆధారిత ఫీచర్లను అందిస్తూ, కొత్త అనుభవాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో ఏఐ ఎంతగా పనిచేస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement