
ఉద్యోగుల పని విధానానికి సంబంధించి అమెజాన్ అమలుచేస్తున్న కొత్త రూల్ ఆ కంపెనీ కొంప ముంచుతోంది. 2025 జనవరి 2 నుంచి ఉద్యోగులకు ఐదు రోజుల వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు అమెజాన్ గత ఏడాది ప్రకటించింది. కోవిడ్ మహమ్మారి తర్వాత కంపెనీ అనుసరిస్తున్న హైబ్రిడ్ విధానానికి ఈ కొత్త నిబంధన ముగింపు పలికింది. అయితే ఈ మార్పే ఇప్పుడు టాప్ టాలెంట్‌ను నియమించుకునే, నిలుపుకునే అమెజాన్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది.
టాలెంట్ ఉన్నవారు రావడం లేదు
అమెజాన్ అంతర్గత డాక్యుమెంట్‌ను ఉటంకిస్తూ బిజినెస్ ఇన్సైడర్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఉద్యోగులు నిర్దేశిత కార్యాలయాలకు సమీపంలోకి రీలొకేట్ కావాలన్న సంస్థ "హబ్ స్ట్రాటజీ" అంశం దాని నియామక బృందాలలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఈ విధానం రిక్రూటర్లను "అధిక డిమాండ్ ఉన్న ప్రతిభావంతులను" తీసుకురావడాన్ని పరిమితం చేస్తుందని, ముఖ్యంగా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో నిపుణులను తీసుకురావడాన్ని పరిమితం చేస్తుందని చెబుతున్నారు.
తక్కువ జీతమున్నా పర్లేదు
గత ఏడాది రిటర్న్-టు-ఆఫీస్ ఆదేశం తరువాత, ఈ విధానం కారణంగా అభ్యర్థులు ఆఫర్లను తిరస్కరించడం గణనీయంగా పెరిగినట్లు తాము గమనించామని కొంతమంది రిక్రూటర్లు చెప్పినట్లుగా నివేదిక పేర్కొంది. ఎక్కువ సౌలభ్యంతో ఉండటంతో చాలా మంది ప్రొఫెషనల్స్ తక్కువ వేతనానికే పోటీ సంస్థల్లో చేరడానికి ఎంచుకున్నారు. దీని వల్ల టెక్ టాలెంట్ ను కోల్పోతున్నామని ఓ రిక్రూటర్ ఆవేదన వ్యక్తం చేశారు.
లాగేసుకుంటున్న పోటీ సంస్థలు
అమెజాన్ రిటర్న్ టు ఆఫీస్ ఆదేశం కేవలం రోజువారీ కార్యాలయ హాజరుకు సంబంధించినది మాత్రమే కాదని నివేదిక వెల్లడించింది. అమెజాన్ 'హబ్స్'కు మారడానికి ఇష్టపడని ఉద్యోగులను స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లుగా పరిగణిస్తున్నారు. ప్రమోషన్లు, పనితీరు సమీక్షలను ఈ ఆదేశానికి ముడిపడిపెట్టారు. ఈ కఠిన విధానం అమెజాన్ కు కూడా భారీ నష్టాన్ని మిగిల్చింది. గత రెండేళ్లలో ఒరాకిల్ 600 మందికి పైగా అమెజాన్ ఉద్యోగులను నియమించుకుందని బ్లూమ్‌బెర్గ్ ఇటీవల నివేదిక పేర్కొంది.
అమెజాన్‌ది మాత్రం అదే మాట
అమెజాన్ ఈ వాదనలను ఖండిస్తోంది. తాము పరిశ్రమ అంతటా టాప్ టాలెంట్‌ను నియమించుకుంటూనే ఉన్నట్లు పేర్కొంది. బిజినెస్ ఇన్ సైడర్ కు ఇచ్చిన ఒక ప్రకటనలో కంపెనీ ప్రతినిధి ఈ నివేదిక ఆధారాన్ని తోసిపుచ్చారు. రిటర్న్ టు ఆఫీస్ విధానంపై కంపెనీ తన వైఖరిని సమర్థించుకుంది. "ఉద్యోగులు వ్యక్తిగతంగా సహకారంతో పనిచేసినప్పుడు ఉత్తమ ఫలితాలను వస్తాయని మేము నమ్ముతున్నాం. ఇది వాస్తవమని కూడా గమనించాం. ఎందుకంటే మేము కొంతకాలంగా ప్రతిరోజూ చాలా మందిని కార్యాలయంలో చూస్తున్నాం" అని ప్రతినిధి వివరించారు.