
న్యూఢిల్లీ: కృత్రిమ మేధస్సు (AI) 21వ శతాబ్దాన్ని నిర్వచించే సాంకేతికతగా ఎదుగుతోంది. 2030 నాటికి ప్రపంచ జీడీపీలో సుమారు 15.7 ట్రిలియన్ డాలర్లను ఏఐ జోడించనుందని ఫీక్కీ-బీసీజీ విడుదల చేసిన "ది గ్లోబల్ ఏఐ రేస్" నివేదిక వెల్లడించింది.
ఏఐ స్వీకరణలో అభివృద్ధి చెందిన దేశాలు ముందంజలో ఉన్నాయి. 66% దేశాలు జాతీయ ఏఐ వ్యూహాలను రూపొందించగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది 30 శాతంగా ఉంది. ఇక తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది కేవలం 12% మాత్రమే. ఈ అసమానత విదేశీ దిగుమతులపై ఆధారపడే ప్రమాదాన్ని పెంచుతోంది.
ఏఐ స్వీకరణ రేస్‌లో కంప్యూట్, డేటా, మోడల్స్, టాలెంట్ అనే నాలుగు కీలక అంశాలు ఉన్నాయి. అమెరికా, చైనా వంటి దేశాలు ఏఐ నిపుణులలో ఆధిపత్యం కలిగి ఉన్నాయి. వ్యవసాయం, ప్రజా సేవలు వంటి రంగాలు ఏఐ స్వీకరణలో ఇంకా వెనుకబడ్డాయి.
వ్యవసాయ రంగంలో ఏఐ ద్వారా 20% ఉత్పత్తి వృద్ధి సాధ్యమవుతుంది. అయితే, సంస్థలు పెట్టుబడులు పెట్టినా ఏఐ పైలట్‌లు క్షేత్రస్థాయికి వెళ్లకముందే సగం విఫలమవుతున్నాయి. రైజ్ (రీసెర్చ్, ఇన్వెస్ట్‌మెంట్, స్కిల్లింగ్, ఎథిక్స్) ఫ్రేమ్‌వర్క్ ద్వారా ప్రభుత్వాలు ఏఐ స్వీకరణ పెంపుపై దృష్టి పెట్టాలి. అంతర్జాతీయ సహకారం, మౌలిక సదుపాయాలు, నైపుణ్య అభివృద్ధి, నైతిక పాలన అవసరం.
"ఏఐ కేవలం సాంకేతిక తరంగం మాత్రమే కాదు.ఇది రాబోయే దశాబ్దాలలో ఆర్థిక, సామాజిక నాయకత్వాన్ని నిర్వచించే వ్యూహాత్మక పోటీ. ఏఐ అనేది ప్రయోజనం కోసం జరిగే పోటీ మాత్రమే కాదు. ప్రపంచానికి విలువను పెంచే పురోగతికి సమిష్టి అన్వేషణ" అని ఫీక్కీ డైరెక్టర్ జనరల్ జ్యోతి విజ్ పేర్కొన్నారు.