
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అక్టోబర్ 10-11 తేదీల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో ఉద్యోగులకు తీపికబురు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ మీటింగ్‌కు సంబంధించిన ఎలాంటి ఎజెండా ఇంకా ఖరారు కాలేదు. కొన్ని సంస్థలు, ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఇందులో కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అందులోకి అంశాలు కింది విధంగా ఉన్నాయి.
ఏటీఎం ద్వారా విత్‌డ్రా..
ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థకు బ్యాంకు లాంటి కార్యాచరణను తీసుకురావనే ప్రణాళికలున్నాయి. ఇందులో ఏటీఎంల ద్వారా పాక్షిక ఉపసంహరణలను అనుమతించడం, యూపీఐ ఆధారిత చెల్లింపులను ప్రారంభించడం వంటివి ఉన్నాయి. 8 కోట్లకు పైగా ఈపీఎఫ్ఓ సభ్యులు తమ పదవీ విరమణ పొదుపును ఎలా నిర్వహిస్తారనే దానిపై గణనీయమైన మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈపీఎఫ్ఓ 3.0 ప్రతిపాదన డిజిటల్ చెల్లింపులు, ఈజ్-ఆఫ్-యాక్సెస్ ఫీచర్లను ఏకీకృతం చేయాలని నిర్ణయించింది. ఆధునిక బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలకు అనుగుణంగా ఇందులో మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవి ఆమోదం పొందితే చందాదారులకు సర్వీసులు సులభతరం అవుతాయి.
ప్రావిడెంట్ ఫండ్‌లో కొంత భాగాన్ని ఏటీఎంల ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు.
ఎంపిక చేసిన లావాదేవీల కోసం వారి ఈపీఎఫ్ ఖాతాల నుంచి నేరుగా చెల్లింపులు చేయడానికి యూపీఐను ఉపయోగించవచ్చు.
పెన్షన్ పెంపు
ప్రస్తుతం రూ.1,000గా నిర్దేశించిన కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.7,500 వరకు పెంచే ప్రతిపాదన కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో ఈమేరకు నిర్ణయాలు తీసుకుంటారని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుడిగా లారీ ఎల్లిసన్