ఎన్‌డీటీవీ ఓపెన్‌ ఆఫర్‌కి కట్టుబడి ఉన్నాం

Adani Group says committed to open offer for NDTV - Sakshi

అదానీ గ్రూప్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ఎన్‌డీటీవీలో అదనంగా 26 శాతం వాటాలను కొనుగోలు చేసే దిశగా ఓపెన్‌ ఆఫర్‌ ప్రక్రియను పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని అదానీ గ్రూప్‌ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఓపెన్‌ ఆఫర్‌ లెటర్‌ ముసాయిదాను పరిశీలించి, అభిప్రాయాలు తెలపాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని కోరింది. ఎన్‌డీటీవీ వ్యవస్థాపకులకు రూ. 400 కోట్ల రుణాలిచ్చిన విశ్వప్రధాన్‌ కమర్షియల్‌ (వీసీపీఎల్‌) అనే సంస్థను ఈ ఏడాది ఆగస్టులో కొనుగోలు చేయడం ద్వారా ఎన్‌డీటీవీలో అదానీ గ్రూప్‌ 29.18 శాతం వాటాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

మైనారిటీ షేర్‌హోల్డర్ల నుండి మరో 26 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అక్టోబర్‌ 17న ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించనున్నట్లు అప్పట్లో వీసీపీఎల్‌ తెలిపింది. కానీ డీల్‌పై ఎన్‌డీటీవీ ప్రమోటర్‌ అయిన ఆర్‌ఆర్‌పీఆర్‌ అనుసరిస్తున్న ప్రతికూల వైఖరి కారణంగా సాధ్యపడలేదని తాజాగా పేర్కొంది. ఓపెన్‌ ఆఫర్‌ ప్రకారం షేరు ఒక్కింటికి రూ. 294 చొప్పున దాదాపు 1.67 కోట్ల షేర్లను (26 శాతం) వీసీపీఎల్‌ కొనుగోలు చేస్తుందంటూ ఇష్యూని నిర్వహిస్తున్న జేఎం ఫైనాన్షియల్‌ గతంలో ఒక ప్రకటనలో పేర్కొంది. దీన్ని బట్టి ఓపెన్‌ ఆఫర్‌ అక్టోబర్‌ 17న ప్రారంభమై నవంబర్‌ 1న ముగియాలి. మరోవైపు, బుధవారం ఎన్‌డీటీవీ షేరు రూ. 332.90 వద్ద క్లోజయ్యింది. ఓపెన్‌ ఆఫర్‌ ధరతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top