
న్యూఢిల్లీ: ఈ ఏడాది జులై నాటికి దేశంలో సుమారు 52,732 స్టార్టప్స్ డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గుర్తింపు, ప్రయోజనాలు పొందాయి. దేశంలో స్టార్టప్స్‌ల ఆవిష్కరణలు, బలమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేంద్రం స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (ఎస్‌ఐఎస్‌ఎఫ్‌ఎస్) కింద ఇప్పటివరకు 9 ఇంక్యుబేటర్లకు రూ.30 కోట్లు మంజూరు చేసినట్లు వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ లోకసభకు రాతపూర్వక సమాధానంలో తెలిపారు. దేశంలో పరిశ్రమల అనుమతుల కోసం సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. దీంతో పెట్టుబడిదారులు వివిధ వాటాదారుల నుంచి అనుమతులు పొందడానికి పలు ఆఫీసులను సందర్శించాల్సిన అవసరాన్ని, సమయాన్ని తగ్గిస్తుందని తెలిపారు.